నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత అంతర్గత చర్చల్లోనూ విశ్లేషణల్లోనూ మునిగిపోయిన వైఎస్ఆర్సిపి ఇప్పుడు మళ్లీ కదలిక పెంచుతున్నది. ఆ తర్వాత దశలో వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం చేసినా ఆశించినంత సంతృప్తి కలిగినట్టు లేదు. అద్యక్షుడు జగన్ నవంబర్ మొదటి వారం నుంచి పాదయాత్ర చేస్తారనే వార్తలున్నాయి. దానికి ముందు జరిపే తిరుపతి కాలినడకన తిరుపతి కార్యక్రమాన్ని ప్రారంభించమని అడిగేందుకే ఆయన చినజీయర్ స్వామి దగ్గరకు వెళ్లారంటారు. సహజంగానే స్వామీజీ అందుకు ఒప్పుకున్నట్టు లేరు. ఇక ఇప్పుడు పాదయాత్రలోపునే అనంతపురంలో ప్రత్యేకహౌదాపై యువభేరి తలపెట్టారు. 10వ తేదీన జరిగే ఈ కార్యక్రమం ఒక విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై వైసీపీకి భ్రమలు తొలగిన ఫలితమేననుకోవాలి. బిజెపి టిడిపి కలసి పోటీ చేయడం ఖాయమని తెలిసిపోతున్న కొద్ది వైసీపీ తన స్వంత పునాదిపైన దృష్టి పెంచింది. యువభేరి వంటి కార్యక్రమమైతే జగన్ బాగా మెప్పిస్తాడని ఆ పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు.
దీనికి తోడుగా ఆ పార్టీ ఎంపి వైవీసుబ్బారెడ్డి ప్రత్యేకంగా మీడియా గోష్టి జరిపి తాము అభివృద్ధికి అడ్డంకి కాదని వివరణ ఇచ్చారు. ఉపాధికి అభివృద్ధికి తాము లనుకూలమేనని, ఆ పేరుతో జరిగే అవినీతినే వ్యతిరేకిస్తున్నామని సోదాహరణంగా చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడలేదని, ఉపాధి హామీ పథకం నిధులు వంటివాటిపై విచారణ జరపాలిని మాత్రమే కోరామని సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఆయన మీడియా ముందుంచారు. అంటే తాము అభివృద్ధికి అడ్డుపడుతున్నామనే చంద్రబాబు నిరంతర ప్రచారాన్ని ఖండించడం అవసరమని వైసీపీ భావిస్తునదన్నమాట. ఇవన్నీ సలహాదారు ప్రశాంత కిశోర్ సూచనల మేరకు జరుగుతుండొచ్చు. క్షేత్ర స్థాయిలో కూడా అనేక బాధ్యతలు ఈ బృందానికి అప్పగించినట్టు చెబుతున్నారు. అందుకు తగినట్టే వారు కూడా వివిధ స్థాయిల నేతలతో సాధారణ ప్రజలతో మీడియా ప్రతినిధులతో చర్చలు జరుపుతూ వైసీపీపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు.