హైదరాబాద్: ఈ ఉదయం కేబీఆర్ పార్క్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న నవీన అనే మహిళను ఒక దొంగ కత్తితో బెదిరించి మెడలో చైన్, సెల్ ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ మహిళ నిరాకరించటంతో తనవద్ద ఉన్న కత్తితో దాడిచేశాడు. అయినా ఆమె గట్టిగా అరుస్తూ ప్రతిఘటించగా స్థానికులు వచ్చి ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తెలుగు రాష్ట్రాలు రెండింటిలో పెద్ద బెడదగా దాపురించిన చైన్ స్నాచర్లకు ఇటీవల గడ్డుకాలం దాపురించినట్లుంది. రెండు రోజులక్రితం అనంతపురంలో ఒక మహిళ మెడలో గొలుసు తెంపుకు పోతున్న ఇద్దరు దొంగలను ఒక యువకుడు ధైర్యంగా పట్టుకున్నాడు. చైన్ లాక్కొని పరారవుతున్న వారి బైక్‌కు తన బైక్ అడ్డం పెట్టి పడేసి ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. తీవ్రగాయాల పాలైన ఆ ఇద్దరూ నగరానికే చెందిన షేక్ వలీ, మహ్మద్ వలీగా గుర్తించారు. మరోవైపు ఆదివారం వరంగల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక జంట బంగారు ఆభరణాలతో హైదరాబాద్ వెళుతూ పట్టుబడింది. వారివద్ద దొరికిన బంగారు ఆభరణాల బరువు 3 కిలోల 10 గ్రాములు. వీటి విలువ రు.82 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ దంపతులు టీవీ ఛానల్స్‌లో క్రైమ్ న్యూస్ చూసి స్ఫూర్తి పొంది చైన్ స్నాచింగ్‌లు ప్రారంభించారు. 2013నుంచి వీరు ఈ పనిలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో హైస్పీడ్ బైకులపై చక్కర్లు కొడుతూ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గత నెల 28న అరెస్ట్ చేశారు. వీరినుంచి 465 గ్రాముల బంగారు ఆభరణాలు, హైస్పీడ్ బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయంపూట ఒంటరిగా ఉన్న మహిళలనుంచి వీరు ఆభరణాలు దోచేవారని పోలీసులు చెప్పారు. పదిహేను రోజుల క్రింత విశాఖ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బ పాలెం గ్రామానికి చెందిన ఆ దొంగ ఉదయం వేళల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. అతనివద్దనుంచి పోలీసులు 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం మీద ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్లు బాగానే పట్టుబడుతున్నారు. పట్టుబడినవారిని పరిశీలిస్తే ఎక్కువమంది విద్యార్థులే ఉండటం విశేషం. హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ సందర్భంగా కొంతమంది బాధిత మహిళలు ప్రాణాలుకూడా కోల్పోవటం విచారకరం. వీటిని అదుపుచేయటానికి పోలీసులు మరింత పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.