అమ్మ బయిలెళ్లడేమో గాని తమిళనాడు చిన్నమ్మ అంటే శశికళ మాత్రం బెయిలుపై బయిటకు వచ్చారు. అది కూడా అయిదంటే అయిదు రోజులే! బెంగుళూరులోని పంపన అగ్రహారం జైలు నుంచి ఆమె బయిటకు వచ్చే సమయానికి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. భర్త నటరాజన్‌తో శశికళకు చాలా కాలంగా సత్సంబంధాలు లేకున్నా ఈ సంకట సమయంలో బయిటకు రావడానికి సాధనం కావడం విశేషం. నటరాజన్ ఆరోగ్యం విషమంగా వుంది గనక చూసి రావడానికి పదిహేను రోజులు పెరోల్ కావాలని ఆమె దరఖాస్తు చేశారు. చిన్నమ్మ రాగానే తమిళనాడు పాలక పక్ష రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చేస్తాయని ఆమె భక్తులు ప్రచారాలు చేశారు. ఫళని స్వామి, పన్నీరుసెల్వం, సహాయ కార్యదరి దినకరనులు ఒక సర్దుబాటుకు వచ్చేస్తారని కూడా కథనాలు వచ్చేశాయి. పదవుల మార్పిడికి కూడా కొందరు సిద్ధమంటున్నారు. అయితే అవన్నీ ఏ మేరకు సాధ్యమో చెప్పడం కష్టం. ఎందుకంటే జైలు అధికారులు ఆమెను రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని, ఎవరినీ కలుసుకోరాదని షరతు పెట్టారు. అయితే అంత శక్తివంతురాలైన నాయకురాలు వచ్చిన తర్వాత ఎంతోకొంత ప్రభావం చూపించకుండా పోదు. అయిదు రోజులు మాత్రమే వచ్చినా తర్వాత ఏదో సాకులతో పొడగించుకోగల సత్తా ఆమెకు వుంది. జైలులోనే ఉద్యోగులను లోబర్చుకునిస్వేచ్చగా బయిటకు వెళ్లి వస్తున్న శశికళ ఒకసారి బయిటకు వచ్చాక ఇవన్నీ తేలిగ్గా చేసేయగలరు. కాని అధికారంలో వున్న వారు ఆమె మాట ఏమాత్రం మన్నిస్తారన్నది సందేహమే. అవసరమైతే రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం కూడా ఆమె తన వారితో చర్చించవచ్చుచని అంటున్నారు. ఒకవేళ ఇవేవీ లేకుండా శశికళ వచ్చిన వ్యక్తి వచ్చినట్టే వెళ్లిపోతే మాత్రం ఆమె ప్రభావం అదృశ్యమైందనుకోవాల్సి వుంటుంది. బహుశా అంత అద్శాన్నంగా వుండకపోవచ్చునని ఆమె అనుయాయులు ఆశపెట్టుకున్నారు. జయలలిత బతికి వుందా లేదా అన్నది తెలియకుండానే అంత కథ నడిపిన సంగతిగుర్తు చేస్తున్నారు. చూడాలి ఏమవుతుందో.