ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి – నిస్సందేహంగా అత్యంత ప్రాచుర్యం ఉన్న తెలుగు పత్రికల్లో ఇవి మొదటి మూడు స్థానాలని ఆక్రమిస్తాయి. అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆ రెండు పత్రికలు చదవొద్దని అన్నా కూడా ఆ రెండు పత్రికలు, అంటే ఈనాడు, జ్యోతి ల పాపులారిటీ తగ్గలేదు. అలాగే ఆ మధ్య చంద్ర బాబు సాక్షి చదవొద్దని అన్నా దాని పాపులారిటీ దానికి ఉంది. అయితే దశాబ్దాలుగా మొదటి ప్లేస్ మాత్రం ఈనాడు దే. కానీ ఈ మధ్య ఈనాడు ని దాటేసింది జ్యోతి. ఈ విషయమై ఈనాడు అంతర్గత సమావేశాల్లో చర్చ కూడా జరిగింది. అదెలా అంటారా…వివరాలివిగో…
జ్యోతి ఈనాడుని దాటేసింది నిజమే కానీ, పత్రిక సర్క్యులేషన్ లో కాదు. అంతర్జాలం (ఇంటర్నెట్) లో. అవును, ఈనాడు వెబ్ సైట్ ర్యాంక్ ని ఆంధ్రజ్యోతి ఇటీవల అధిగమించేసింది. ఇప్పుడు “ఈనాడు” అలెక్సా గ్లోబల్ ర్యాంక్ 1437 ఉంటే, “ఆంధ్ర జ్యోతి” ర్యాంక్ 919. అదే ఇండియా ర్యాంక్ తీసుకుంటే, “ఈనాడు” కి 124 ర్యాంక్ ఉంటే “జ్యోతి” ది 81. ఆ రకంగా వెబ్ ర్యాంక్ వరకు “ఈనాడు” పై “జ్యోతి” పై చేయి సాధించింది. ఇక “సాక్షి” తీసుకుంటే గ్లోబల్ ర్యాంక్ 2643 అయితే ఇండియా ర్యాంక్ 196 గా ఉంది. అయితే, ఈనాడు ఆఫీస్ సమావేశాల్లో ఈ అంశం చర్చకి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈనాడు వెబ్ సైట్ రూపురేఖలు ఏమైనా మార్చాల్సి ఉందా అని కూడా చర్చించినట్టు సమాచారం. అయితే, పాఠకులు ఇప్పటికీ సమాచార ఖచ్చితత్వం కోసం “ఈనాడు” నే ఎక్కువ నమ్ముతున్నారని, అయితే ఖచ్చితత్వం కోసం తపించే కారణంగా కొన్ని సార్లు సమాచారం ఇవ్వడం లో కాస్త ఆలస్యమవుతున్నందున, వేగవంతమైన సమాచారం కోసం కొందరు పాఠకులు ఇతర (జ్యోతి) పత్రికలు రెఫర్ చేస్తున్నారనీ కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా , అలెక్సా ర్యాంకుల విషయాన్ని పేరుమోసిన పత్రికలు కూడా పరిగణిస్తున్నాయని, దాన్ని ఆధారంగా చేసుకొని తమని తాము సరిచేసుకోవలసిన అవసరం ఉందేమోనని బేరీజు వేసుకుంటున్నాయని తెలియడం ఆశ్చర్యమే.