ఎనర్జీ అంటే రవితేజదే! తెరపై తానొక్కడూ వందమందితో సమానం. రవితేజ సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు అవ్వడానికి కారణం… అతని ఎనర్జీనే. ఎందుకో గత కొన్ని సినిమాలుగా ఆ ఉత్సాహం మిస్స్ అయ్యింది. ఇప్పుడు అది వడ్డీతో కొట్టడానికి సిద్ధమయ్యాడు.. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. రవితేజ అంధుడిగా కనిపిస్తున్నాడన్న విషయం ముందే చెప్పేశారు. అంధ పాత్ర ని హీరోగా మలచి, ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్, అదీ రవితేజ స్టైల్ ఆఫ్ ఎనర్జీతో అందించాలనుకోవడం నిజంగా గొప్ప విషయమే. ట్రైలర్ చూస్తే… దాన్ని సక్సెస్‌ఫుల్‌గా సాధించేసినట్టు అనిపిస్తోంది.
మా అమ్మ నాకు నేర్పింది ఒక్కటే. లైఫ్ ఏదీ ఎదురొచ్చి ఇవ్వదు.. ఎదురెళ్లి తీసుకోవడమే అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. రవితేజ అల్లరికి ఎక్కడా బ్రేకులు పడలేదు. ఆర్జీవీ ట్వీట్‌పై సెటైర్ బాగానే పేలినట్టు కనిపిస్తోంది.
‘ఎన్నికళ్లు నన్ను చూస్తున్నా…’ అనే మరో పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకొంది. వచ్చి ఒకసారి నాకు కనపడు అనేది సాధారణమైన ఎక్స్ప్రెషన్. ఇక్కడ రవితేజ అంధుడు కాబట్టి ‘వచ్చి ఒక్కసారి నాకు వినపడు’ అని వాడాడు దర్శకుడు. సాయి కార్తీక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా మెహరీన్ కనిపించిన ప్రతీసారీ… విషాదాన్ని ధ్వనించేలా ఇచ్చిన ఆర్. ఆర్ తప్పకుండా నచ్చుతుంది. పటాస్‌లో శ్రీనివాసరెడ్డిని బాగా వాడుకొన్నాడు అనిల్ రావిపూడి. ఈసారీ అతనికి మంచి డైలాగులే ఇచ్చినట్టున్నాడు. లాస్ట్ పంచ్ అయితే… రవితేజ స్టైల్లోనే రచ్చ రచ్చగా ఉంది. మొత్తానికి రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కు ఈ సినిమా జిరాక్స్ కాపీలా కనిపిస్తోంది.