ఎట్టకేలకు ఆ లాంఛనం పూర్తికాబోతోంది. కాంగ్రెస్ అధినేతగా రాహుల్ గాంధీ సంపూర్ణ బాధ్యతలు తీసుకోబోతున్నారు. గడచిన పదమూడేళ్లుగా రాహుల్ ప్రజా జీవితంలో ఉంటున్నారు. ఈ నెల 25న అధికారంగా పార్టీ పగ్గాల అప్పగింత కార్యక్రమం పూర్తవుతుంది. అయితే, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓ భారీ బహిరంగ సభ ఉంటుందని అనుకున్నారు. కానీ, రాహుల్ ఫోకస్ మాత్రం తెలంగాణపైనే ఉంది! పార్టీ బాధ్యతలు స్వీకరించిన మర్నాడే ఆయన తెలంగాణ పర్యటనకు వస్తుండటం విశేషం. అది కూడా హైదరాబాద్ లో కాదు! మహబుబాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటూ పీసీసీకి ఆదేశాలు ఇచ్చారు. అయితే, పార్టీ అధ్యక్షుడి హోదాలో తొలి సభ తెలంగాణలో పెట్టుకోవడం… అందునా మహబుబాబాద్ ను ఎంపిక చేసుకోవడం అనేది వ్యూహాత్మకమే అంటున్నారు రాష్ట్ర నేతలు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కు ఇంకా చాలా ఆశలే ఉన్నాయి. తమ హయాంలో రాష్ట్రం ఇచ్చినా సరే.. ఆ ఘనత తమదే అని చెప్పుకోవడంలో విఫలమయ్యారు. విభజన దెబ్బతో అటు ఆంధ్రాలో పార్టీకి నామరూపాలు లేకుండా పోయింది. అయితే, కాస్త కష్టపడితే తెలంగాణలో తమ సత్తా చాటుకోవచ్చనేది రాహుల్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రత్యేక టీమ్ ను రాష్ట్రానికి పంపారనీ, ఇక్కడి పరిస్థితులపై రాహుల్ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక, తొలి బహిరంగ సభకు మెహబుబాబాద్ ఎంపిక వెనక కూడా ప్రత్యేక కారణం ఉందట! ఈ పార్లమెంటు నియోజక వర్గంలో తెరాస సర్కారుపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందనేది కాంగ్రెస్ అంచనా!
హరితహారంలో భాగంగా గిరిజనుల పోడు భూముల్ని తీసుకోవడం వివాదమైన సంగతి తెలిసిందే. అంతకుముందు, రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో కూడా మెహబుబాబాద్ లో చోటు చేసుకుంది. అది కూడా వార్తల్లో కీలకంగా నిలిచిన ఘటనే. దీంతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు సరిగా జరగడం లేదనీ, వెనుకబడిన వర్గాల విషయంలో కేసీఆర్ సర్కారు తీరు సరిగా లేదనీ, ఆ అసంతృప్తి ఆయా వర్గాల్లో తీవ్రంగా ఉందనేది కాంగ్రెస్ అంచనాగా తెలుస్తోంది. అందుకే, అధ్యక్షుడి హోదాలో తొలి సభను ఇక్కడే నిర్వహిస్తే.. పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది వారి అంచనా! పైగా, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రానికి రావడం ద్వారా.. తెలంగాణకు కాంగ్రెస్ చాలా ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందనేది కూడా కాంగ్రెస్ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి, ఈ సభ ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చి, ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. అయితే, అధ్యక్షుడి హోదాలో తొలిసారి తెలంగాణకు వస్తున్న రాహుల్… రాష్ట్ర నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలకు తెర దించే ప్రయత్నం ఏ మేరకు చేస్తారూ అనేది కూడా ఆసక్తికరమైన విషయమే! కాంగ్రెస్ లో సీనియర్ నేతల మధ్య సయోధ్య లేకపోవడం అనేది బహిరంగ రహస్యంగానే ఉంది. వీరందరినీ ఏకతాటిపై రాహుల్ తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. అద్యక్షుడిగా తొలి విజయం సాధించారని చెప్పుకోవచ్చు.