రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు అంటారు. శత్రువులు కలిసిపోయిన సందర్భాలు చాలానే చూస్తుంటాం. కానీ, మిత్రులు విడిపోవడం చాలా అరుదు. ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరి మధ్యా ఇప్పుడు ఈ రాజకీయమే చిచ్చు పెట్టిందని చెప్పాలి! ఆ ఇద్దరూ ఎవరంటే… తెలంగాణ తెలుగుదేశం కీలక నేత రేవంత్ రెడ్డి, ఆంధ్రాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. రాష్ట్రం విడిపోక ముందు వీరిద్దరూ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు. విపక్షంలో ఉండగా అధికార పార్టీని ముచ్చెమటలు పట్టించేలా ఈ ఇద్దరు మాట్లాడేవారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరూ కలిసిమెలసి ఉండేవారు. రాష్ట్రం విడిపోవడంతో ఎవరిదారి వారిదైంది. కేసీఆర్ పై రేవంత్ పోరాటం చేస్తుంటే, ఆంధ్రా రాజకీయాల్లో పయ్యావుల కాస్త వెనకబడ్డారు. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా స్నేహం చెడిందని చెప్పాలి. దానికి కారకులు మరెవ్వరో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! ఆయన ఓ పెళ్లి కోసం అనంతపురం వెళ్లి, అక్కడే పయ్యావులతో బహిరంగంగా రహస్య చర్చలు జరిపారు కదా! అక్కడే మొదలైంది అసలు కథ.
ఈ చర్చలు తరువాత తెలంగాణలో తెరాసతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. తెరాసతో కలిసి సాగడం తప్పేముందనే వాదనను పయ్యావుల కూడా వినిపించడం విశేషం. నిజానికి, తెలంగాణలోని ఒక సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడమే కేసీఆర్ లక్ష్యం. ఈ విషయం తెలిసి కూడా తెరాసతో స్నేహంలో తప్పేముందని పయ్యావుల వ్యాఖ్యానించేసరికి రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసతో పొత్తుకు సంబంధించి ఆంధ్రా నేత అత్యుత్సాహ ప్రకటనలు తగ్గించుకోవాలని రేవంత్ అన్నారట! ప్రాణాలకు తెగించి మరీ తాను కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే, ఆయనతో పొత్తు అనడం సరైందని కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో తన మిత్రుడు పయ్యావులకు రేవంత్ ఓ సలహా కూడా ఇచ్చారు. తెలంగాణ రాజకీయాలపై పయ్యావులకు అంత ఆసక్తి ఉంటే ఆయన తెరాసలో చేరిపోవచ్చనీ, కూకట్ పల్లి నుంచో లేదంటే మరో ప్రాంతం నుంచే గులాబీ జెండా పట్టుకుని పోటీ చేసుకోవచ్చని కూడా రేవంత్ అనేశారు.
కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడమే కేసీఆర్ వ్యూహం. దాన్లో భాగంగానే తెలుగుదేశంతో పొత్తు లీకులు! ఈ క్రమంలో పయ్యావుల, రేవంత్ ల మధ్య అభిప్రాయ భేదాలకు కారణమైంది. తెలంగాణ రాజకీయాల్లో పయ్యావుల జోక్యాన్ని రేవంత్ తీవ్రంగానే వ్యతిరేకించినట్టు సమాచారం. టీడీపీ అండగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గాన్ని తెరాస వైపు పంపించేలా పయ్యావుల మాట్లాడటం సరికాదని కూడా రేవంత్ అన్నారట! మొత్తానికి, చంద్రబాబు నాయుడు సమక్షంలో చిరకాల మిత్రుల మధ్య చిచ్చు రేగిందని తెలుస్తోంది.