ఆంధ్రాలో విపక్షం వైకాపా నుంచి రేపోమాపో భారీ వలసలు ఉండటం ఖాయం అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు నేతలు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ జిల్లాల నేతలతో వైకాపా అధినేత జగన్ కూడా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మనమే కాబట్టి, తొందరపడొద్దంటూ బుజ్జగించారు కూడా. అయినాసరే, వలసలు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో అనంతపురంలో కీలకమైన రాజకీయానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెర తీశారనే అభిప్రాయం స్థానిక టీడీపీ నేతల నుంచే వినిపిస్తూ ఉండటం విశేషం! అనంతపురం అర్బన్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వెనక ఎంపీ జేసీ ప్రోత్సాహం బాగానే ఉందని సమాచారం!
నిజానికి, జేసీ తెలుగుదేశంలోకి వచ్చిన దగ్గర నుంచీ అనంతపురంలో చాపకింద నీరులా గ్రూపు రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. తన ఉనికిని చాటుకునేందుకు జేసీ ఏదో ఒక రచ్చ చేసే ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్యనే రాజీనామా డ్రామా సీన్ వేశారు! ఇప్పుడు గురునాథ్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి, తమ పట్టు పెంచుకునేందుకు జేసీ సోదరులు ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం! ఎందుకంటే, జేసీ సోదరులకూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికీ మధ్య విభేదాలు ఎప్పట్నుంచో ఉన్నవే. ఒకే పార్టీలో ఉంటున్నా కూడా ప్రభాకర్ కీ జేసీ సోదరులకూ పొసగడం లేదు. పార్టీ అధినాయకత్వం కూడా గతంలో చాలా సయోధ్య ప్రయత్నాలు చేసినా జేసీ తీరు మారడం లేదు. అలాగని జేసీని దూరం పెట్టే పరిస్థితి కూడా టీడీపీకి లేదు! ఎందుకంటే, సీమలో రెడ్డి సామాజిక వర్గ నేతల అవసరం చంద్రబాబుకి తెలియంది కాదు. ఈ పరిస్థితి ఎప్పటికిప్పుడు తనకు అనుకూలంగా మార్చుకునేందు జేసీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
అనంత అర్భన్ లో ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే గురునాథ్ రెడ్డిని తెస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎలాగూ గురునాథ్ తనకు అనుకూలంగా ఉంటారు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ఆయనకి సీటు ఇప్పించే స్థాయిలో చంద్రబాబుపై ఒత్తిడి పెంచగలననే ధీమా జేసీకి ఉందట. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి ఈ స్థాయిలో భరోసా కల్పించారని అనంతలో ప్రచారం జరుగుతోంది. అయితే, జేసీ తెర వెనక వేస్తున్న ఈ వ్యూహాం తెలుస్తున్నా కూడా ఆయన్ని ఏమీ అనలేని పరిస్థితి పార్టీలో నెలకొందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీలో గురునాథ్ చేరడం జరిగిపోతే, అనంత రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది.