ఆంధ్రా భాజపా నేతలకు ఎప్పట్నుంచో ఉన్న సమస్య ఇదే! కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో తెలుగుదేశం అదుపాజ్ఞల్లో ఉండాల్సి వస్తోందనే ఆవేదన కొంతమంది నేతల్లో ఉంది. పొత్తు ఉన్నంత మాత్రాన తమ పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత టీడీపీ ఇవ్వడం లేదనేది వారి అభిప్రాయం. కేంద్రం ఇస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాల క్రెడిట్ కూడా టీడీపీ సొంత ఖాతాలో వేసేసుకుంటోందన్నది వాస్తవం. అయితే, దీనిపై ఏపీ భాజపా నేతలందరూ స్పందిస్తున్నారా..? చంద్రబాబు సర్కారు పనితీరును నిలదీస్తున్నారా అంటే అదీ లేదు! ఎందుకంటే, ఏపీ భాజపాలో చంద్రబాబు అత్యంత సన్నిహిత వర్గీయులే ఎక్కువ కదా! కేవలం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రమే ఎప్పటికప్పుడు ఈ వాదన వినిపిస్తూ ఉంటారు. కేంద్రం నిధులను రాష్ట్రం ఘనతగానే చెప్పుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు సోము వీర్రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మరుగుదొడ్ల నిర్మాణం మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకూ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని వీర్రాజు అన్నారు. అయితే, ఈ పనులన్నీ కేంద్రం వల్ల జరుగుతూ ఉంటే.. అది తమ ఘనతే అన్నట్టుగా టీడీపీ చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు. భాజపా చేస్తున్న పనులేవీ కనిపించకుండా చేస్తున్నారనీ, దీంతో కార్యకర్తలు మౌనంగా ఉండిపోవాల్సి వస్తోందన్నారు. ప్రజల్లోకి వెళ్లి, పార్టీ తరఫున జరుగుతున్న అభివృద్ధి ఏంటనేది చెప్పుకోలేని పరిస్థితి క్రియేట్ సృష్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ… దీని కోసం కేంద్రం ఇంతవరకూ రూ. 6 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అయితే, ఇదంతా తన కృషి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు అని వీర్రాజు చెప్పారు. ఈ మధ్యనే స్వచ్ఛ భారత్ ప్రచార పోస్టర్లపై ప్రధాన మోడీ ఫొటో పెట్టలేదంటూ వీర్రాజు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వీర్రాజు ఆవేదనలో వాస్తవాలు లేకపోలేదు. చెప్పుకోవడానికి ఏమీ మిగల్చకపోతుండటంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురౌతున్న సంగతి వాస్తవమే. అయితే, వీర్రాజు ఆవేదన వినేది ఎవరనేది ప్రశ్న..? రాష్ట్రంలో ఇతర ప్రముఖ భాజపా నేతలు కూడా ఉన్నారు కదా! కేంద్ర పథకాల విషయంలోగానీ, పోలవరం నిధుల విషయంలోగానీ వారు ఇలా మాట్లాడిన సందర్భాలేవీ..? వీర్రాజు వాదనను సమర్థించే భాజపా నేతలు ఎవరున్నారు..? ఆంధ్రాలో ఇప్పట్లో భాజపా సొంతంగా ఎదిగే పరిస్థితి లేదన్నది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ, రాష్ట్ర నేతల్లో చిత్తశుద్ధి లోపిస్తే.. ఎవరు మాత్రం ఏం చేయగలరు..? వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అదుపాజ్ఞల్లోనే భాజపా నేతలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి!