భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు పదవీ గండం ఉందంటూ కొన్ని మీడియా ఛానెళ్ళలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకించి సాక్షి ఛానెల్ లో ఈ ప్రాపగండా కొంచెం ఎక్కువగానే నడుస్తోంది.భూమానాగిరెడ్డి వైసిపి నుండి టిడిపి లోకి మారాక మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో చంద్రబాబు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు.అయితే ఇప్పుడు అఖిల ప్రియ మీద బాబు గుర్రుగా ఉన్నారంటూ ఈ కథనాలు వెలువడుతున్నాయి. ఆ కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి –
“గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.”.
ఇవీ ఆ కథనాలు . ఆ “పార్టీ సీనియర్ నేత” పేరు చెప్పకుండా, వ్రాస్తున్న ఈ కథనాల్లో వాస్తవం కంటే కూడా, అఖిల ప్రియని ఇరుకున పెట్టాలనే లేక ఆమెని బద్నాం చేయాలనే ప్రయత్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె అభిమానులంటున్నారు. నంద్యాల ఎలక్షన్ల కోసం ఊరు వాడా తిరిగి ఆ కుటుంబం మొత్తం ఎంతో కష్టపడ్డారనీ, వైసిపి వాళ్ళు నంద్యాల ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారనీ, అయితే ఆమెని ఏమీ చేయలేక ఇలా అసత్య కథనాలతో ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారనీ వారంటున్నారు.
అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడైతే ఆమె పదవికి వచ్చిన గండమేమీ లేదని సామాన్యులు కూడా అభిప్రాయపడుతున్నారు.