సింగరేణి విజయంతో నల్గొండ ఉప ఎన్నికవైపు దూసుకుపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీలు భావిస్తుండొచ్చు గాని ఆ పార్టీ ప్రముఖులు చాలామంది మరో విధంగాస్పందిస్తున్నారు. కెసిఆర్ ఆయన కుటుంబం చక్రం తిప్పినా తమకు కూడా ఎంతో కొంత పాత్ర వుండాలి కదా అని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాల నియోజకవర్గాలు చూసుకోవలసిన ఎంపిలు గుస్సాగా వున్నారు. మాకంటూ ఏదో ఒక స్థానం గౌరవం కల్పిస్తే కదా ఫేస్ వాల్యూ పెరిగేది. మా మాట ఎవరైనా వినేది.. ఏం లేకపోతే మేము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాం. స్వంతంగా ప్రతిపక్షాలను ఖండించడానికి , కీలక సందర్భాల్లో మీడియాతో మాట్లాడేందుకు కూడా అనుమతివుండటం లేదు అని ఎంపిలు వాపోతున్నారు.కేంద్రంలో వేరే ప్రభుత్వం వుంది. అక్కడ మాకు పెద్దగా మాట వుండదు. ఎప్పుడైనా అవకాశం వస్తే పార్లమెంటులో నాలుగు ముక్కలు మాట్లాడ్డం తప్ప చెయ్యగలిగింది లేదు. పైగా ముఖ్యమంత్రి తమ పట్ల అనుకూలంగా వున్నారనే ధీమా కూడా బిజెపి కేంద్ర నాయకత్వానికి ఏర్పడటంతో మేము ఏం మాట్లాడినా ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లోనైనా మాకు కొన్ని బాధ్యతలు అప్పజెప్పి పనులు చేయించకపోతే రేపు మళ్లీ ఎన్నికల్లోఓట్లడగడానికి ఎలావెళ్లాలి? వెళ్లినా వాళ్లు వూరుకుంటారా? కెసిఆర్ ఆకర్షణ ఆయన పట్ల ఆదరణ నిజమే కావచ్చు గాని మేము డమ్మీలమైపోతే ఎలా అని కొంతమంది ఎంపిలు ఎంఎల్ఎలు వాపోతున్నారు.