వచ్చే ఎన్నికల్లో తెరాస, టీడీపీల మధ్య పొత్తులు ఉండొచ్చు అనే కథనాలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం వెళ్లి వచ్చిన తరువాత, ఈ రెండు పార్టీల మధ్యా కొత్త పొత్తుకు అవకాశం ఉంటుందేమో అనే రాజకీయ వాతావరణం కనిపించింది. అయితే, ఈ రకమైన చర్చకు తెరలేపడం ద్వారా కేసీఆర్ ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనమేంటో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటికే అంశయ్య మీదున్న టీ టీడీపీకి ఇది ఇబ్బందికరమైన చర్చే. అందుకే, ఈ పొత్తు కథనాలకు వీలైనంత త్వరగా తెర దించాల్సిన అవసరం ఉంది. అందుకే, తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది టీటీడీపీ నాయకత్వం!
వచ్చే ఎన్నికల్లో తెరాస పొత్తు పెట్టుకుంటారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేశారు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ. తెరాసతో కలిసి పోటీ చేస్తామని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదన్నారు. ఆ పార్టీతో పోత్తు అనే చర్చ తమ మధ్య జరగడం లేదని కొట్టి పారేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే తెలుగుదేశం ఎన్నికల బరిలోకి వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నామన్నారు. భాజపాతో పొత్తు అంశమై కూడా ఆయన మాట్లాడారు! భాజపా కూడా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ఎందుకు చెబుతోందో తమకు అర్థం కావడం లేదని రమణ ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం! నిజానికి, పొత్తు విషయమై ఇప్పట్లో మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశమై రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు, ఈ ప్రస్థావన తీసుకొచ్చిన పయ్యావుల కేశవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తెరాసతో పొత్తు అనే చర్చకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్టుంది! ఇంకా ఆలస్యం చేస్తే.. రాష్ట్ర టీడీపీలోని లుకలుకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీ టీడీపీలో పొత్తులకు సంబంధించి రేవంత్ రెడ్డి అభిప్రాయం ఒకలా ఉంటే, మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయం మరోలా ఉంది. ఇతర నేతల ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి! కొందరు కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటుంటే, మరికొందరు భాజపాతో దోస్తీ వద్దని కూడా అంటున్నారు! ఈ తరుణంలో తెరాసతో కూడా దోస్తానా అంటే.. తెలంగాణ తెలుగుదేశం పయనం ఎటు అనే చర్చ ఇప్పుడు మొదలౌతుంది. ఓరకంగా రాష్ట్ర పార్టీలో కావాల్సినంత గందరగోళాన్ని ఈ పొత్తు కథనాలు సృష్టించాయనడంలో సందేహం లేదు. మరి, పార్టీ అధ్యక్షుడే పొత్తులపై స్పందించారు కాబట్టి దీనిపై ఊహాగానాలు తగ్గొచ్చు. కానీ, రాష్ట్ర టీడీపీలో ఈ అంశం కొన్ని మార్పులకు పునాది కావొచ్చనేదే విశ్లేషకుల అంచనా.