ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందానేది చెప్పుకోవాలంటే… ముంజేతి కంకణాన్ని అద్దంలో చూసుకున్నట్టు! రాష్ట్ర విభజన వల్లనే ఆంధ్రాలో పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నది వాస్తవమే. అయిందేదో అయిపోయింది. గడచిన మూడున్నరేళ్లుగా పార్టీ పునరుజ్జీవానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది ఎవరనేదే ప్రశ్న..? ప్రముఖ నేతలంతా పార్టీలు మారిపోయారు. ఎటూ వెళ్లలేనివారు మాత్రమే మిగిలిపోయారు. పోనీ, ఉన్నవారి పోరాటమైనా ఉద్ధృతంగా చేస్తున్నారా అంటే అదీ లేదు! తాటాకు చప్పుళ్లు మాదిరిగా ఏ అమావాస్యకో పౌర్ణమికో ఒక ప్రెస్ మీట్ పెట్టడం… ఇదే మా పోరాటం అన్నట్టుగా చేతులు దులుపుకోవడం! ఇదే వారి పోరాటం! తాజాగా ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి.
అనంతపురంలో ప్రతిపక్ష వైకాపా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రఘువీరా విమర్శలు చేశారు. ఏ లక్ష్యంతో జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసమా, లేదా రాజకీయం చేయడం కోసమా అంటూ ఎద్దేవా చేశారు. హోదా కోసం రాజీలేని లేని పోరాటం సాగిస్తామని నమ్మబలికి, తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పోరాటాన్ని జగన్ తాకట్టు పెట్టేశారన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానన్నారనీ, మాట తప్పనూ మడమ తిప్పనూ అంటూ ప్రగల్బాలు పలుకుతారని అన్నారు. జూన్ దాటిపోయి అక్టోబర్ వచ్చినా ఎంపీలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. భాజపాతో జగన్ చేతులు కలిపి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు.
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లక్ష్యం, పోరాటం ఏంటంటే… వైకాపాని విమర్శించడం. ఎందుకంటే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైకాపా ఖాతాలోకి వెళ్లింది. పైగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ క్రెడిట్ ను ఆయన వాడేసుకుంటున్నారు. అవన్నీ మళ్లీ తమకు దక్కాలనే ఉద్దేశంతోనే వైకాపానే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే, చంద్రబాబు సర్కారుపై పెద్దగా విమర్శలు చేయడం తగ్గించుకున్నారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలో ఒక చిన్న లాజిక్ ను రఘువీరా మిస్ అవుతున్నారు! ఏ రాజకీయ పార్టీకైనా, అధికారంలో ఉన్నవారిని విమర్శిస్తూ, వారి విధానాలపై పోరాటాలు సాగిస్తేనే మనుగడ ఉంటుంది. అప్పుడే ప్రజల తరఫున పోరాడినట్టు అవుతుంది. అంతేగానీ, ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటే ఏం లాభం..? పక్క రాష్ట్రం తెలంగాణలో చూసుకున్నా.. కేసీఆర్ సర్కారునే అక్కడి కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పోరాటాలు చేస్తున్నారు. అంతేగానీ, రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన టీడీపీ, భాజపా అంటూ పోరాటాలు చేయడం లేదు కదా! మా ఓటు బ్యాంకు వైకాపా దగ్గరుందీ, అందుకే జగన్ పై పోరాడుతున్నాం అనే సంకేతాలు ప్రజలకు నేరుగా ఇస్తుంటే… ఈ క్రమంలో వారి తరఫున పార్టీ ఏం చేస్తున్నట్టు..? ప్రత్యేక హోదా విషయమే తీసుకుందాం.. ఇంతవరకూ ఏపీ కాంగ్రెస్ నేతలు చేసిన పోరాటాలేవీ, రఘువీరా చేపట్టిన ఉద్యమాలేవీ..?