భారతీయ జనతా పార్టీతో ఇంకా పొత్తు అవసరమా..? ఈ ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోందనీ, చర్చ జరుగుతోందనీ ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. భాజపాతో పొత్తుపై క్లారిటీ అవసరమా అంటూ ఏపీ నేతలూ చాలా సందర్భాల్లో అభిప్రాయపడుతూనే ఉంటారు. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడుకి తెలియంది కాదు. భాజపాతో పొత్తు చర్చ ఎప్పుడు మొదలైనా… ప్రస్తుతానికి విమర్శలొద్దు, ఎన్నికలకు చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకుందాం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో భాజపా విషయమై ఇప్పటికీ గందరగోళ పరిస్థితే ఉంది. కానీ, తాజాగా ఇదే అంశమై పార్టీ ఓ అంతర్గత సమావేశంలో పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు చేశారట! ఆయన ఇచ్చిన స్పష్టత పైనే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం.
భాజపా స్నేహ ధర్మం పాటించడం లేదని, పదవుల విషయంలో టీడీపీని పట్టించుకోవడం లేదనే ఆవేదనను ఆయన వ్యక్తం చేశారట. భాజపాకి ఆంధ్రా నుంచి రాజ్యసభ సీటు ఇచ్చాం, మంత్రి వర్గంలో చోటిచ్చాం, అవకాశం ఉన్నచోట నామినేటెడ్ పదవులు ఇస్తున్నామన్నారట. కానీ, ఒక గవర్నర్ పదవి అడిగితే దానిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదని పార్టీ నేతల ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర సాయం సరిగా లేదనీ, అయినా రాజీపడకుండా సొంతంగానే సమస్యల్ని అధిగమిస్తున్నామని అన్నారట. సరే, ఇంతవరకూ చంద్రబాబు చెప్పింది ఎలా అర్థమౌతోంది అంటే.. భాజపాతో పొత్తు ఉండబోదనే నేతలకు అన్యాపదేశంగా చెబుతున్నట్టే కదా! చంద్రబాబు మనోగతం ఇదే కాబోలు అని పార్టీ నేతలు ఫిక్స్ కాబోతున్న తరుణంలో.. మరో ట్విస్ట్ ఇచ్చారట! టీడీపీ విషయంలో భాజపా వైఖరి ఇలా ఉన్నా.. వారితో పోరాడుతూ కూర్చేలేం కదా, దానికోసం సమయం వృధా చేసుకోలేం కదా అని చంద్రబాబు అన్నారట!
దీంతో కొంతమంది సీనియర్ నేతలు ఏమంటున్నారంటే… చంద్రబాబు వద్దంటున్నారు కాబట్టి, కేంద్రంపై విమర్శలు చేయడం లేదనీ, లేకుండా రోజు అంశంపై భాజపాని కడిగేస్తామని చెబుతున్నారు! వారు వినిపిస్తున్న మరో చిత్రమైన వాదన ఏంటంటే… భాజపాతో స్నేహన్ని తూలనాడుకుంటే ఆ పార్టీతో చేతులు కలిపేందుకు వైకాపా సిద్ధంగా ఉందనీ, ఆ అవకాశంవారికి ఇవ్వకూడదన్నదే తమ ధ్యేయం అని కొందరు పెద్దలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. ఇంతకీ… భాజపా విషయమై చంద్రబాబు ఏం చెప్పినట్టు..? టీడీపీ నేతలకు వచ్చిన క్లారిటీ ఏంటీ..? తిప్పితిప్పీ… భాజపాతో దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసినట్టే కదా! చంద్రబాబుకి భాజపా తీరుపై అసంతృప్తి ఉందికానీ, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే అంశం దృష్యా మౌనంగా ఉండిపోతున్నారని పార్టీ నేతలు అనుకోవాలి. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇదే ఆయన మనోగతం అని అర్థం చేసుకోవచ్చా..?