‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ గా ఎవరు కనిపించబోతున్నారన్న విషయంలో ఆసక్తి రేగుతోంది. ఈ పాత్ర కోసం రాంగోపాల్ వర్మ ప్రకాష్‌రాజ్‌ని సంప్రదించారని, ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇదంతా పుకారే అని టాక్. ఎన్టీఆర్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్‌ని ఎంచుకొన్నారన్న విషయంలో ఎలాంటి నిజం లేదని, ఇదంతా ఒట్టిమాటేనని ప్రకాష్ రాజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల వర్మ – ప్రకాష్ రాజ్కలుసుకొన్న మాట నిజమేనని, అయితే ఎక్కడా ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన రాలేదని చెబుతున్నారు. దాంతో ఎన్టీఆర్ కోసం రామూ అన్వేషణ ఇంకా ఓ కొలిక్కి రాలేదని అర్థమవుతోంది. రంగ, వీరప్పన్.. ఇలా నిజ జీవిత కథల్ని తెరకెక్కించడం రామూకి కొత్తేం కాదు. అయితే.. ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతీసారీ పేరున్న నటీనటుల్ని కాకుండా కొత్తవారిని ఎంచుకోవడం వర్మకి అలవాటు. ఈసారీ ఆయన కొత్త నటుడినే ఎన్టీఆర్‌గా చూపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్‌గా కనిపించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.