ప్రత్యేక హోదా.. ఎవరు ఏమనుకున్నా ఇది కాలం చెల్లిన టాపిక్! హోదాకు తత్సమానమైన ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందింది! అంతే, అక్కడితో ఆ అంకం ముగిసింది. కానీ, ఇప్పుడు ఇదే ఆ అంశాన్ని మరోసారి తెరమీది తెచ్చే ప్రయత్నం చేశారు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి! అనంతపురంలో జరిగిన యువభేరిలో దీన్నే ప్రధానంగా ప్రస్థావించారు. హోదా గురించి ఆంధ్రాలో మాట్లాడేవాళ్లు లేకపోవడం సమస్యగా మారిందన్నారు. హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చి ఉండేవన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. వారు చెప్పిన సమయంలో హోదా ఇచ్చి ఉంటే, అనంతపురం లాంటి కరవు జిల్లాలకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలిగేవన్నారు.
ఈ సందర్భంగా ముఖమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీలు గతంలో హోదా గురించి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులు ప్రదర్శించారు. తాను త్వరలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు బయలుదేతున్నాను కాబట్టి, ఇకపై ప్రత్యేక హోదా పోరాటాన్ని పార్టీ శాసన సభ్యులు, నియోజక వర్గాల సమన్వకర్తలకు అప్పగిస్తున్నట్టు జగన్ ప్రకటించడం విశేషం! హోదాకి సంబంధించిన ఉద్యమాన్ని వారే నడిపిస్తారన్నారు. అంతేకాదు.. హోదా సాధన పోరాటంలో చివరి అస్త్రంగా వైకాపా పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తారని కూడా జగన్ ఇప్పుడు చెప్పడం విశేషం.
ఇక, వాస్తవాలు మాట్లాడుకుంటే… గడచిన కొన్ని నెలలుగా ప్రత్యేక హోదా గురించి వైకాపా మాట్లాడిందా..? హోదా ఆంధ్రాకు తప్పనిసరిగా రావాలనే చిత్తశుద్ధి వారి నరనరాల్లో నిండి ఉంటే.. సెమీ ఫైనల్స్ గా అభివర్ణించిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ ప్రస్థావన ఎందుకు తేలేదు..? అదే ప్రధాన అజెండా ఎందుకు కాలేదు..? తెలుగుదేశం వైఫల్యంగా ఎందుకు ప్రచారం చేయలేకపోయారు..? హోదాపై మాట్లాడేవాళ్లు లేకపోయారని జగన్ నిర్వేదంగా వ్యాఖ్యానించారు! ఈ కామెంట్ ఆయనకు కూడా వర్తిస్తుంది కదా. ప్రత్యేక హోదా సాధన కోసం ఇన్నాళ్లూ వైకాపా సాగించిన ఉద్యమం ఏంటో వారికే తెలియాలి! ఆ ఉద్యమ రూపం ఏంటో, ఉనికి ఏంటో, కార్యాచరణ ఎక్కడుందో కూడా వారే చెప్పాలి. అలాంటి ఉద్యమం బాధ్యతల్ని పార్టీ నేతలకు అప్పగిస్తున్నట్టు జగన్ ప్రకటించడం విడ్డూరం! అక్కడితో ఆగినా బాగుండేది… హోదా కోసం చివరి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తారని కూడా చెప్పారు! ఇంతకీ ఆ ‘చివర’ ఎప్పుడు..? ఈ అస్త్రాన్ని ప్రయోగించే ఆఖరి ఘట్టం ఎన్నాళ్లకు వస్తుంది..? గడచిన కొన్ని నెలలుగా ఇదే మాట చెబుతూ వస్తున్నారు. జూన్ లో రాజీనామాలు అన్నారు, అక్టోబర్ కూడా దాటేస్తోంది. అయినా ఆ అస్త్ర ప్రయోగానికి అనువైన కాలమే వారికి దొరకడం లేదు.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం కూడా ఉందండోయ్! ఈ సందర్భంలో ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాపై మనస్ఫూర్తిగా విమర్శలు చేశారా అంటే.. అదీ లేదు! ఈ విషయంలో జనసేనానే కొంత నయం. ఓ నాలుగైదు సభల్లో కేంద్రం వైఖరిని ఉతికి ఆరేశారు. ఆ స్థాయి విమర్శలు జగన్ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశించకపోయినా.. ఆంధ్రా విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని ఆయన ప్రశ్నించొచ్చు. కానీ, ఆ పనీ చెయ్యలేదే..! ఇకపై చెయ్యలేరు కూడా! ఎందుకో ఏమిటో అందరికీ తెలిసిందే. భాజపాతో పొత్తు కావాలి కదా! అలాంటప్పుడు, ఇంకా చివరి అస్త్రం ఉందని చెబితే నమ్మేదెవరు..? అది ప్రయోగానికి పనికిరాని అస్త్రంగానే మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.