ఏనుగు తలకాయతో ఉన్న వినాయకుడేకదా, ఏ రకమైన ఆకులైనా తినేస్తాడులే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీకు కనిపించిన మొక్కల ఆకులు పీక్కునొచ్చి పత్రిపూజ చేస్తానంటే ఆయన అస్సలు ఊరుకోడు. తనకు ఏ రకమైన పత్రి ఇష్టమో తెలియజేసే మెనూకార్డు ఎప్పుడో ఇచ్చేశాడు. అందులో ఉన్న 21 రకాల పత్రితోనే పూజించాలి. పూజలో వాడే పత్రిఅంతా మనకీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. మరి గణపతి పత్రిలోని ఆరోగ్య సూత్రమేమిటో తెలుసుకుందామా?
వినాయక చవితి పర్వదినంనాడు 21వ పత్రితో గణనాథునికి పూజచేయాలి. అయితే, ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. గణపతికి ఏ పత్రాలు ఇష్టమో వాటితోనే పూజించాలేకానీ, ఏవో ఆకులు, కొమ్మలు దొరికాయికదా, వాటితో పూజచేద్దామని అనుకోకూడదు. ఎందుకంటే, ఏనుగులు ఆకులు తింటాయన్నది నిజమేకావచ్చ, కానీ కొన్ని చెట్ల ఆకులు అస్సలు ముట్టుకోవు. మరి అలాంటి ఆకులనే పత్రిపూజకు వాడితే వినాయకునికి సంతోషం కలగదు సరికదా… కోపం వస్తుంది. అందుకే, telugu360.com పాఠకులైన మీకోసం బొజ్జ గణపయ్యకు ఏ పత్రి ఇష్టమో వాటి గురించీ, వాటిలోని ఆరోగ్య రహస్యం గురించి అందజేస్తున్నది.
ఏకవింశతి అంటే 21 రకాలు అన్నమాట. వీటి గురించి తెలుసుకుందాం. ఈ పత్రితోనే గణపతి పూజచేద్దాం…
1. బృహతీ పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
2. మాచీ పత్రం (ధవనం):- ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
3. బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం(షుగర్ వ్యాధి), విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.
4. దూర్వాలు పత్రం (గరికె -గడ్డిజాతి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.
5. దత్తూర పత్రం (ఉమ్మెత్త):- ఊపిరితితులను వ్యకోచింపజేస్తుంది. ఉబ్బసం తగ్గేలా చూస్తుంది.
6. బదరీ పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
7. తుర్యా పత్రం(తులసి):- శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. జలుబు తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి.
ఆ మొక్క నుంచి వచ్చే గాలే దివ్యౌషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులువేసిన నీళ్లు తాగితే అనేక రోగాలు మటుమాయం. అందుకే దేవుడి గుళ్లలో తులసితీర్థం ఇస్తూ, దీర్ఘాయువుగా ఉండమని పూజారి దీవిస్తాడు.
8. అపామార్గ పత్రం(ఉత్తరేణి): దగ్గు ,ఉబ్బసవ్యాధులపై బాగా పని చేస్తుంది.
9. చూత పత్రం(మామిడి ఆకు):- నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది. ఏనుగు తన దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఈ ఆకులే తింటుంది.
10. జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంబంధ వ్యాధులపై మంచి గుణం చూపిస్తుంది.
11. గండకీ పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
12. అశ్వత్థ పత్రం (రావి ఆకు): చాల ఓషధగుణాలు ఉన్నాయి ఇందులో…. అనేక ఆయుర్వేద ఔషధాల్లో కలుపుతారు.
13. అర్జున పత్రం(మద్ది ఆకూ):- రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
14. అర్క పత్రం (జిల్లేడు ఆకు) :- నరాల బలహీనత ఉన్నవారికిది దివ్య ఔషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15. విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు):- దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది. ఇది చెంతఉంటే సౌందర్యశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదట.
16. దాడిమీ పత్రం (దానిమ్మ):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
17. దేవదారు (దేవదారు చెట్టు):- దీని ఆకులు శరీర వేడిని తగ్గిస్తాయి.
18. మరువక (మరువం):- మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
19. సింధువార పత్రం(వావిలాకు):- కీల్లనోప్పులకు మంచి మందు.
20. శమీ పత్రం(జమ్మి చెట్టు):- నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
21. కరవీర పత్రం(గన్నేరు):- గడ్డలు,పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.
తనకిష్టమైన ఈ ఇరువది ఒక్క పత్రాలతో పూజించడం వల్ల ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటారన్నదే గణనాధుడు వినాయక వ్రతం ద్వారా మనకిదిస్తున్న దివ్య ఆరోగ్య సందేశం.
– ఎన్.ఆర్. తుర్లపాటి