నవంబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమౌతున్నారు విపక్షనేత జగన్మోహన్ రెడ్డి. ఇంకోపక్క పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. పాదయాత్రపై చర్చించేందుకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు ఇలా అన్ని శాఖల నేతలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ‘పునాదులు కదిలిపోయేలా ’ ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు ఇచ్చారు. అనుకున్న సమయానికి ముందుగానే ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్నాయనీ, వచ్చే ఏడాది అక్టోబర్ నాటికే మనం సిద్ధంగా ఉండాలన్నారు. ఓపక్క తాను పాదయాత్ర చేస్తుంటే, అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలు సమాంతరంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తన పాదయాత్ర ముగిసేనాటికి చంద్రబాబు ప్రభుత్వం ‘పునాదులు కదిలేలా’ కార్యాచరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరు నెలలు పూర్తయ్యేసరికి టీడీపీ సర్కారు ‘పునాదులు కూల్చేలా’ పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు.
ఎమ్మెల్యే రోజా చెప్పినట్టుగా వైయస్ కుటుంబానికి పాదయాత్ర ఒక టర్నింగ్ పాయింటే! నాడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాకనే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అదే బాటలో నేడు జగన్ కూడా ప్రజల్లోకి బయలుదేరుతున్నారు. కానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డికీ జగన్ కీ సంసిద్ధతలో చాలా స్పష్టమైన తేడా ఉంది! వైయస్ పాదయాత్ర చేపట్టిన నాటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. హైటెక్ పేరుతో రైతులను నాటి చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం మానేసింది. ఇతర రంగాలను కూడా నిర్లక్ష్యం చేసింది. దాంతో రాష్ట్రవ్యాప్త రైతాంగం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అప్పటికే, తొమ్మిదిదేళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా మొదలైంది. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారమే తన ధ్యేయం అన్నట్టుగా నాడు వైయస్ పాదయాత్రకు బయలుదేరారు. అన్నదాతలకు భరోసా కల్పించడమే తన లక్ష్యం అంటూ ప్రజల్లోకి వెళ్లారు!
అయితే, ఇప్పుడు జగన్ పాదయాత్ర వెళ్తున్న ధోరణి ఎలా ఉందంటే… చంద్రబాబు ప్రభుత్వం పునాదులు కదల్చడమే! పార్టీ శ్రేణులను కూడా ఇదే కోణం నుంచీ సిద్ధం చేస్తున్నారు. ఆర్నెల్లలోపు చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవాలీ, పడిపోవాలీ, గద్దె దిగిపోవాలీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. పాదయాత్ర అంతిమ లక్ష్యం ఇదే కావొచ్చు. కానీ, రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారూ, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారూ, సామాన్యులు అవస్థలు పడుతున్నారూ.. వారందరికీ భరోసాగా పాదయాత్ర చేస్తున్నాం అనేట్టుగా జగన్ వ్యవహార శైలి ఉండటం లేదు. నాడు వైయస్ అయినా, నేడు జగన్ అయినా పాదయాత్ర లక్ష్యం అధికారమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ‘ఈ యాత్ర ప్రజలకోసం చేస్తున్నా’ అనే కంటే.. ‘అధికారం కోసమే చూస్తున్నా’ అనే అర్థమే జగన్ మాటల్లో ధ్వనిస్తోంది. ప్రజల్లోకి కూడా అదే భావనను పదేపదే పంపించినట్టు అవుతోంది. నాడు ‘రైతుల కోసం రాజన్న వస్తున్నాడు’ అన్నట్టుగా వైయస్ పాదయాత్ర సాగింది. నేడు ‘అన్న వస్తున్నాడు’ అంటూ భావోద్వేగాల ప్రేరితంగానే జగన్ బయలు దేరుతున్నారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది కదా!