తెరాసతో టీడీపీ పొత్తు ఉంటుందనే కథనాలు రాజకీయంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అనంతపురం వెళ్లడం, అక్కడ టీడీపీ నేతలతో స్నేహంగా మెలగడం.. వెరసి ఇది పొత్తు పొడుపునకు దారి తీసే పరిణామం అన్నట్టుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇదే అంశమై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు కూడా రేవంత్ రెడ్డి ప్రస్థావించారు. పొత్తుల విషయం ఎవ్వరూ మాట్లాడొద్దనీ, పార్టీ విస్తరణ పనులు మాత్రమే చూసుకోవాలనీ, సమయం వచ్చినప్పుడు ఎవరితో పొత్తులు ఉంటాయో పార్టీ నిర్ణయిస్తుందంటూ చంద్రబాబు కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టూ కథనాలు వచ్చాయి. తెరాసతో పొత్తు ఉండే అవకాశాలు లేవని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడా స్పష్టం చేసేశారు. ఇక్కడితో ఈ రగడ సుఖాంతం అయిందని అనుకున్నారు. కానీ, తెర వెనక కొన్ని సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తోంది! రేవంత్ రెడ్డి తన సొంత వ్యూహంతో ముందుకెళ్లే ఆలోచనల్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ఓ రకంగా రేవంత్ అప్రకటిత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఇక, ఆ సామాజిక వర్గానికీ కేసీఆర్ కీ మధ్య దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసు కాబట్టే, టీడీపీకి సానుకూలంగా ఉంటున్నట్టు సంకేతాలు ఇవ్వడం ద్వారా, ఆ లోటును కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించడంతో భర్తీ చేసుకోవాలనేది ఆయన ఎత్తుగడ! అయితే, ఈ పొత్తు విషయం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పడటం లేదనేది వాస్తవం. ఇదే విషయం చంద్రబాబు దగ్గర ప్రస్థావిస్తే… ఇప్పుడీ చర్చ అనవసరం అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టంగా ఏమీ చెప్పలేదు. దీంతో రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీన్లో భాగంగానే తెరాసతో పొత్తు వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలందరితోనూ రేవంత్ సమావేశం నిర్వహించినట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఈ క్రమంలో సంఘటితం చేయాలన్నది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు.
ఎలాగూ ఎన్నికలు వచ్చే వరకూ టీడీపీ అధినాయకత్వం పొత్తుల విషయమై ఎటూ తేల్చదు. రేవంత్ సూచించినట్టు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే, అదే జరిగితే ఆంధ్రాలో టీడీపీకి పెద్ద సమస్య అవుతుంది కదా! కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ అధినాయకత్వం పొత్తుల విషయమై ఏవైనా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటే… వాటిని వ్యతిరేకించేందుకు కావాల్సిన బలాన్ని రేవంత్ ఇప్పట్నుంచే సిద్ధం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఒకవేళ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను రేవంత్ వెతుక్కున్నా, అప్పటికే తనకంటూ ఓ సామాజిక వర్గం మద్దతు ఉండేలా చూసుకునే దిశగా పావులు కదుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, తెరాసతో టీడీపీ పొత్తు కథనాలు మీడియాలో ఆగిపోవచ్చేమోగానీ… ఆ చర్చ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై స్పష్టంగా పడేట్టుగానే ఉంది.