రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన రంగాలలో వ్యవహారాలు పెద్దగా మారలేదుగాని టీవీ ఛానళ్ల చర్చలలో మార్పు కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయాలను సమాన ప్రాధాన్యతతో చర్చించాలని అంటున్నా అనుకుంటున్నా ఎపికి సంబంధించిన ప్రతినిధుల అందుబాటు తగ్గిపోతున్నది. ప్రముఖ ఛానళ్లన్నీ హైదరాబాదులో కొనసాగుతుండటంతో చర్చ ఇక్కడే నడుస్తుంటుంది. ఎపిలో వారికి ఓబివ్యాన్లు లేదా 3 జి కిట్లు, అక్కడ స్టూడియోలలో కూచోబెట్డడం వంటి పద్ధతులతో భాగం కల్పించాలి. అయితే అవి అందరికీ సమానంగా వుండవు. వున్నా పని చేయడంలో సమస్యలు రావచ్చు. ఒకరికి మించి బయిటనుంచి తీసుకుంటే సమన్వయంలో సమస్యలు వుంటాయి. కొన్ని సార్లు ఢిల్లీ నుంచి తీసుకోవాలి. ఇలా రకరకాల కారణాల వల్ల గతంలోలా నేతల లభ్యత, సమతుల్యత తగ్గిపోతున్నాయి. ఎపిలో ఇప్పటికి ఇంకా టీవీ ప్లాట్‌ఫాంలు ఏర్పడలేదు. అంతేగాక పార్టీలు ఫిరాయింపుల నేపథ్యంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో త్వరపడి అధికారంలో వున్నవారిని విమర్శించేందుకు కొంతమంది సిద్దపడటం లేదు. బాగా సీనియర్లు మరీ జూనియర్లు తప్ప మధ్యంతర దొంతరలో వారంతా ఆచితూచి అడుగేస్తున్నారు. అధికార పార్టీలలో పదవులు వచ్చిన వారు చర్చలలో పాల్గొనేందుకు ఉత్సాహం తగ్గించగా రాని వారు నిరుత్సాహంతో ఆగిపోతున్నారు. రేటింగులు వ్యూయర్ షిప్ లెక్కల ప్రకారం చానళ్ల యాజమాన్యాలు కూడా కొంచమైనా ఆకర్షణీయంగా మాట్లాడేవారినే పిలవాలనుకుంటున్నాయి. అన్నిటినీ మించి వాటిపై నిఘా, నిలిపివేతలు పెరిగిన నేపథ్యంలో విమర్శనాత్మక చర్చలు వీర విమర్శలు వద్దనుకుంటున్నాయి. దీనికి వారు కనిపెట్టిన ఫార్ములా ఏమంటే – ఎపిలో ఏదైనా వివాదం నడుస్తుంటే తెలంగాణ సమస్యలు చర్చించడం. తెలంగాణ భగ్గుమంటే గనక ఎపివి తీసుకోవడం.. రెండూ ఇబ్బందిగా వుంటే జాతీయ రాజకీయాలు వుండనే వుంటాయి. ఈ క్రమంలో సహజంగా చర్చకు రావలసిన వస్తాయని వీక్షకులు ఆశిస్తున్న అంశాలు వెనక్కు పోతున్నాయి. ఎన్నడూ లేనిది ఫలానా విషయం ప్రస్తావించకండని ముందే నిర్వాహకులు సంకేతాలు ఇవ్వడం మొదలైంది.