తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు తమ అనుభవాలను బాగానే ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఒకరి అనుభవాలు మరొకరికి గుణపాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆంధ్రాలో నంద్యాల ఉప ఎన్నిక జరిగి, టీడీపీ విజయం సాధించడంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్ కు కావాల్సినంత ఉత్సాహం లభించింది. ఇదే ఊపు తెరాసలో తేవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నల్గొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికకు వెళ్లాలనుకున్నారు. ఈ విషయంలో తెరాసకు టీడీపీ స్ఫూర్తి. ఇక, టీడీపీకి తెరాసకు స్ఫూర్తిగా నిలిచిన మరో ఘటన కూడా ఉందండోయ్! తెరాస అనుభవాన్ని దృష్టిలోపెట్టుకుని ఏకంగా ఏపీ సర్కారు ఓ కీలక నిర్ణయాన్నే మార్చేసుకుంది. కేవలం తెలంగాణ అనుభవాలను దృష్టిపెట్టుకునే టీడీపీ సర్కారుకు ఓ పథకంలో మార్పులు చేయడం విశేషం.
బీసీలకు కూడా చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర కూడా వేశారు. అయితే, ఈ చంద్రన్న కానుక అంశం క్యాబినెట్ భేటీకి వచ్చే ముందు శాఖాపరంగా చాలా చర్చ జరిగిందని సమాచారం. ముందుగా అనుకున్నది ఏంటంటే… ఈ చంద్రన్న కానుకలో భాగంగా రూ. 25 వేలు నగదు ఇచ్చి, మరో రూ. 5 వేలతో చీరలూ ఇతర దుస్తులు కొనుగోలు చేసి ఇద్దామని. ఇదే ప్రతిపాదన మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆయన ఈ దుస్తులు కొనుగోలు ఆలోచన వద్దన్నారట! పెళ్లి కానుకలు ఏవైనా సరే నగదు రూపంలో మాత్రమే ఇవ్వాలని మంత్రి అన్నారు. ఎందుకంటే, దుస్తులు కొనుగోలు చేసి పంపిణీ చేస్తే.. ఎక్కడైనా ఏవైనా లోపాలు దొర్లితే తెలంగాణలో తెరాసకు ఎదురైన అనుభవమే మనమూ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. ప్రతిపక్షాలకు మరో విమర్శనాస్త్రం ఇచ్చినట్టు అవుతుందన్నారట. ఈ సందర్భంగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాన్ని మంత్రి ప్రస్థావించినట్టు తెలుస్తోంది. దీంతో నిర్ణయం మారిపోయిందనీ, టీడీపీలో ప్రముఖ నేతలు కూడా పెళ్లి కానుకలో చీరలు లాంటి దుస్తులు పెట్టకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారట!
తెలంగాణలో బతుకమ్మ చీరల వివాదం తెరాసకు కావాల్సినంత చెడ్డపేరు తెచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటూ విమర్శల్ని తిప్పికొట్టేందుకు తెరాస ప్రయత్నించినా… గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. అయితే, ఈ అనుభవాన్ని చూసుకుని ఆంధ్రాలో టీడీపీ వెనక్కి తగ్గడం విశేషం. అంటే, నాణ్యతగల దుస్తులు ఇవ్వలేమని వారే ఒప్పుకున్నట్టు అయిందనే చెప్పాలి. తెలంగాణలో పంపిణీ చేసిన చీరల్లో నాణ్యతా లోపమే వివాదానికి కారణమైంది. చంద్రన్న కానుకలో భాగంగా నాణ్యమైన దుస్తులు ఇస్తే ఎవరైనా ఎందుకు విమర్శలు చేస్తారు..? ప్రతిపక్షాల విమర్శలకు భయపడి సంక్షేమ పథకాల్లో ఎవరైనా ఇలా మార్పులు చేస్తారా..? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ప్రజా సంక్షేమం కోసమే ఇలాంటి పథకాల రూపకల్పన అంటారు, కానీ అడుగడుగునా రాజకీయ ప్రయోజనాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు!