ఏ రంగంలోనైనా అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేదే ముఖ్యం కదండీ! రాజకీయాల్లో అయితే అదే పునాది. కాస్త సినీ గ్లామర్ ఉండి, స్క్రిప్టు లేకుండా మాట్లాడటం వస్తే చాలు… ఇలాంటి వారికోసమే పార్టీలు ఎదురుచూస్తున్న రోజులు ఇవి! సరిగ్గా ఇదే కోటాలో రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యారు మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్. ఆమె తెలుగుదేశం తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడం దాదాపు ఖాయం అన్నట్టే ఉంది. తనకు ఎంతో ఇచ్చిన తెలుగువాళ్లకి, కొంత సేవ చేసుకోవాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని వాణీ విశ్వనాథ్ ఆ మధ్య చెప్పారు. సరే, తెలుగుదేశం ఆమెని రమ్మని పిలిచిందా, ప్రజాసేవ వెళ్లమని పంపిందా అనేది కాసేపు పక్కన పెడితే… వైకాపా ఎమ్మెల్యే రోజాపై వాణీ విశ్వనాథ్ పోటీ చేస్తుందని టీడీపీ వర్గాలు దాదాపు ఫిక్స్ అయిపోయాయి. మరి, ఇలాంటి సందర్భంలో వాణీ విశ్వనాథ్ ఏం చెయ్యాలి..? ‘రోజాకు ధీటైన నాయకురాలు నేనే’ అని ఏదో ఒక సందర్భంలో స్వీయప్రకటన చేసుకోవాలి కదా. ఇప్పుడు సరిగ్గా అలాంటి సందర్భం వచ్చింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వివాదాస్పద చిత్రానికి మళ్లీ శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీ పార్వతి కోణం నుంచి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, వర్మకు కావాల్సింది సంచలనం మాత్రమే. ఆయన ఎక్కడో కూర్చుని ట్వీట్లు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ మధ్య టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్లో మరో యాంగిల్ ఏంటంటే… వర్మ తీయబోతున్న ఆ వివాదాస్పద చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో ఎమ్మెల్యే రోజా నటిస్తారట! ఈ సందర్భంలో వాణీ విశ్వనాథ్ కూడా స్పందించారు. తాను ‘ఎన్టీఆర్ అభిమాని’గా వర్మకు ఓ సలహా ఇస్తున్నాననీ, ఆయన జీవితం సినిమా తీయడం మానుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చిపెట్టే ప్రయత్నాలు ఆపకపోతే, ఎన్టీఆర్ ‘అభిమానులతో కలసి’ రామ్ గోపాల్ వర్మ ఇంటికి ముందు ‘ధర్నా’కు దిగుతా అన్నారు. వర్మపై ఇలాంటి కామెంట్ చేస్తే ఏమౌతుంది.. బురదలో రాయి విసిరినట్టు అవుతుంది! ఆయన కూడా కాస్త వెటకారంగానే ప్రతిస్పందించారు, అది అప్రస్తుతం.
ఈ సినిమా రచ్చ నేపథ్యంలో తనను తాను ఒక తెలుగుదేశం నాయకురాలిగా వాణీ విశ్వనాథ్ స్వీయ ప్రకటన చేసేసుకుంటున్నారు! తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని అని చెప్పారు. గతంలో ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా ఏ కార్యక్రమంలోనైనా, లేదా ఏ సినీ ఇంటర్వ్యూలోనైనా ఎన్టీఆర్ అంటే ఈ స్థాయి అభిమానమూ గౌరవం తనకు ఉందని వాణీ విశ్వనాథ్ చెప్పిన దాఖలాలు ఉన్నాయా..? మరో విషయం ఏంటంటే… ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ధర్నాకు దిగుతా అంటున్నారు. అంటే, తన వెంట ఎన్టీఆర్ అభిమానులు కదలివస్తారనీ, ఒక నాయకురాలి హోదాలో ధర్నాలు కూడా చేయగలను అని ప్రకటించేసుకున్నట్టే! ఇది చాలదూ నగరి టిక్కెట్ ఆమెకి కేటాయించేందుకు..! ఈ కామెంట్ల ద్వారా పార్టీ దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసినట్టే కదా! ఒక నాయకురాలిగా తాను పనికొస్తానని చెప్పడం కోసం ఇంతకంటే ఇంకేం అర్హత కావాలి చెప్పండీ! సినీ గ్లామర్ ఉంది (అది ఆమె అభిప్రాయం), ఇదిగో ఇలాంటి సందర్భాలొస్తే విమర్శలు చేయగలరు, అవసరమైతే ధర్నాలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.. కనీసార్హతలన్నీ ఉన్నట్టే కదా!