ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నవ్యాంధ్రలో నిర్మించాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం. అందుకే, భవనాల డిజైన్ల విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు! ఒకటికి పదిసార్లు నమూనాలు వేయిస్తున్నారు. ఇదే క్రమంలో దర్శకుడు రాజమౌళి సలహాలను కూడా తీసుకుంటున్నారు. మరి, సినీ దర్శకుడైన రాజమౌళీలో భారీ భవన నిర్మాణానుభవాన్ని ఎలా చూశారో ఏం చూశారో వారికే తెలియాలి! ఏపీ మంత్రి నారాయణ, సీఆర్ డియే కమిషనర్ శ్రీధర్ లతో కలసి దర్శకుడు రాజమౌళీ లండన్ వెళ్లారు. నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు! అద్భుతమైన కట్టడాలకు కావాల్సిన నమూనాలకు అదనపు మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ నమూనాల తయారీ ప్రహసనం రానురానూ ఎలా తయారౌతోందంటే… ముఖ్యమంత్రికి నచ్చేలా డిజైన్లను తయారు చేయడమే అంతిమ లక్ష్యం అన్నట్టుగా!
నిజానికి, డిజైన్ల విషయంలో మొదట్నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు. ఇంకా ఏవో మార్పులూ చేర్పులూ చేయాలనే సూచిస్తూ ఉన్నారు. దీంతో సీఆర్డీయే అధికారులకు ఇదో పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన కోరుకుంటున్నది ఏంటనేది వారికి అర్థం కాకుండా పోయింది. సరిగ్గా ఇదే సమయంలో… ముఖ్యమంత్రి నోట దర్శకుడు రాజమౌళి పేరు వచ్చింది. అంతే, వెంటనే మంత్రి నారాయణ రంగంలోకి దిగేసి, హుటాహుటిన రాజమౌళి దగ్గరకు అధికారులతో వెళ్లిపోయారు. లండన్ కు కూడా రాజమౌళిని బయలుదేరించేశారు. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారనేది కనీసం రాజమౌళి అయినా డీ కోడ్ చేస్తారనేది మంత్రి నారాయణ అభిప్రాయం కావొచ్చు! డిజైన్ల రూపకల్పనలోకి రాజమౌళి వచ్చేసరికి మంత్రి నారాయణతోపాటు అధికారులకు కాస్త భరోసా లభించిందనీ, ఈ పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త డిజైన్లకు సీఎం ఆమోదముద్ర వేస్తారనేది వారి భరోసాగా తెలుస్తోంది.
అంటే, నమూనాల విషయంలో ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. మంత్రి నారాయణలోగానీ, అధికారుల్లోగానీ ఇదే దృక్పథం స్పష్టంగా ఉంది కదా! ఇంకో విషయం… ఈ వ్యవహారంలో దర్శకుడు రాజమౌళిని దించడంపై కూడా చాలా విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అవేవీ పట్టించుకోకుండా ఆయన్ని లండన్ కు తీసుకెళ్లారు. సినిమా సెట్లు వేయించిన అనుభవం, రాజధాని భవనాలకు మెరుగులు దిద్దడానికి ఏమేరకు పనికొస్తుందో చూడాలి! ఏదైతేనేం, లండన్ పర్యటన వెళ్లిన బృందం, ముఖ్యమంత్రికి నచ్చే విధంగా నమూనాలు తయారు చేస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ఆ నమూనాలు ఖరారు అయితే… పనుల సంగతి దేవుడెరుగు, ప్రచారం చేసుకోవడానికైనా పనికొస్తాయి కదా! అప్పుడు కూడా రాజమౌళికి బాధ్యత అప్పగిస్తే.. భారీ భారీ పోస్టర్లూ కటౌట్లూ బాగా తయారు చేస్తారు కదా.