ఈ రోజు ఉదయం ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేశాను. పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన రాసిన కొత్తపలుకులో వున్నది వున్నట్టు గుర్తు చేసినందుకు అభినందించాను. ఆర్కే లేదా అంధ్రజ్యోతి పేరంటేనే వైఎస్ఆర్సిపికి నచ్చకపోవచ్చు. కమ్యూనిస్టులనూ ఆయన అప్పుడప్పుడూ ఎగతాళి చేస్తూ విస్మరించవచ్చు. దాని గురించి నేనే విమర్శ రాశాను కూడా. అలాటివి ఎన్ని వున్నా ఇప్పటి మీడియాలో అనుకున్నది అనుకున్నట్టు చాలా సందర్బాల్లో జనం అనుకుంటున్నట్టు కూడా సూటిగా రాయడం చెప్పడం ఆయనకు రివాజుగా మారింది. ఈ పదిహేనేళ్ల పయనంలో తనకు ముఖ్యంగా సహకరించిన వారిని, పూర్వ సంపాదకులకూ గుర్తు చేసుకున్నారు. తాను చంద్రబాబు నాయుడుకు బినామీననే ఆరోపణలకూ సమాధానం చెప్పారు. తనపై కక్ష గట్టి రెండేళ్లు వేధించిన సంఘర్షణకు మూలం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గనక ఆయనే దిగిరావాలని తాను చెప్పినట్టు కూడా స్పష్టం చేశారు. జగన్ పార్టీ తమను బహిష్కరించడం వల్ల వారి సమాచారం సరిగ్గా ఇవ్వలేకపోతున్నామని ఒక వివరణ ఇచ్చారు.మొత్తంపైన తమపైన వున్న ఆరోపణలనూ అపోహలనూ కూడా తానే చెప్పి సమాధానమివ్వడం మంచి సంప్రదాయమే. ఆయన కోణంతో లేదా వివరణతో అందరూ ఏకీభవించకపోవచ్చు గాని అందులోని తర్కాన్ని ఒప్పుకోకతప్పదు. అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రతిపక్షాలకు అంతో ఇంతో స్థలంఇస్తున్నది తామేనని కూడా నిస్సంకోచంగా రాశారు. తమ పత్రిక ఈ పదిహేనేళ్లలో అనేక రెట్లు అభివృద్ధి చెందిన విషయం చెబుతూ ఇక మీదట మరిన్ని కొత్త శీర్షికలుతీసుకొస్తామని వాగ్దానం చేశారు. చూడాలి మరి. ఏదేమైనా తెలుగు మీడియాలో భిన్నకోణాలకు ఇంకా అవకాశమిస్తున్న ఆంధ్రజ్యోతి మరింత అభివృద్ది చెందాలనే ఎవరైనా కోరుకుంటారు.నేనూ అదే ఆకాంక్ష వెలిబుచ్చాను.