నిరుద్యోగం పెరిగిందంటే మరీ ఇంతా? సర్కారీ కొలువుకు మరీ ఇంత డిమాండా? ఉత్తర ప్రదేశ్ సచివాలయంలో 368 ప్యూన్ పోస్టులకు 23 లక్షల మంది దరఖాస్తు చేశారట. ఈ అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే విస్మయకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. అభ్యర్థుల్లో కనీసం రెండు లక్షల మంది పీజీ, డిగ్రీ చదివిన వారేనట. వీరిలో బీటెక్ పాసైన వారు కూడా ఉన్నారు.
255 మంది పిహెచ్ డి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. నిజానికి ఈ పోస్టుకు కనీస విద్యార్హత 5వ తరగతి పాసై ఉండటం. అలా కేవలం ఐదో తరగతి మాత్రమే పాసైన అభ్యర్థులు 53 వేల మంది మాత్రమేనట. మిగతా వారంతా పెద్ద పెద్ద చదువులు చదివిన వారే.
యూపీ సచివాలయ భవనం ఉన్న లక్నో నగర జనాభా 45 లక్షలు. ఈ పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 23 లక్షలు. అంటే లక్నో జనాభాలో సగానికి పైగా అన్న మాట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ పోస్టులను ఇంటర్ వ్యూ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇన్ని లక్షల మందికి మొదట కాల్ లెటర్స్ పంపడం, షెడ్యూల్ ప్రకారం ఇంటర్ వ్యూ జరపడం పెద్ద ప్రాసెసే. ఈ తతంగం అంతా పూర్తయి పోస్టింగులు ఇవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుందంటున్నారు అధికారులు.