సినీనటి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను విపరీతంగా చికాకు పెట్టే అంశాల్లో టిడిపి లాంటి ప్రత్యర్ధులు మాత్రమే కాదు.. ఆమె జడ్జ్‌గా వ్యవహరిస్తున్న టీవీ షో జబర్థస్త్ది కూడా ప్రధానమైన పాత్రే. గత కొంత కాలంగా ఆమె ప్రత్యర్ధులకు అస్త్రంగా మారిందీ టీవీ షో. వెకిలి హాస్యానికి వేదికగా విమర్శలు అందుకుంటున్నప్పటికీ విజయవంతమైన కార్యక్రమంగా దూసుకుపోతున్న ఈ షో… ఎంతో మంది హాస్య కళాకారులను అమాంతం స్టార్స్‌ను చేసిందనేది నిజం. అదే సమయంలో రోజాకు ఈ షో ఆర్ధికంగా ఉపయోగపడిందేమో కానీ… రాజకీయంగా అంతకు మించి ఇబ్బందులకు గురిచేసింది. చేస్తోంది కూడా. గతంలో అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో మహిళల సమస్యల మీద మాట్లాడినప్పుడు గాని, మరికొన్ని సందర్భాల్లో కూడా జబర్ధస్త్‌నే ప్రత్యర్ధులు ప్రధాన అస్త్రంగా మలచుకుని రోజా నోటికి అడ్డుకట్ట వేశారు. అప్పట్లో ఈ విషయంలో వైసీపీ పార్టీ పెద్దలు కూడా రోజాకు పలు సూచనలు చేశారని, దీంతో ఈ షోకు ఆమె దూరం కావాలని నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అకస్మాత్తుగా జబర్ధస్త్‌లో ఆమె సహ న్యాయ నిర్ణేత, సినీనటుడు నాగబాబు కుమార్తె నీహారిక ప్రత్యక్షమవడంతో ఇక రోజా జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేసినట్టే అని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె ఆ షోలో యధాతధంగా కొనసాగుతూనే ఉన్నారు.
ఈ నేపధ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నను ఎదుర్కున్న రోజా… ఒకానొక సమయంలో జబర్ధస్త్‌ను తాను విడిచిపెట్టాలనుకున్నట్టు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని కొందరు సన్నిహితుల వద్ద ప్రస్తావించినప్పుడు వారు వారించారని, ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో, అది ఎన్ని ఇళ్లలో నవ్వుల పూలు పూయిస్తుందో తనకు వివరించారని అన్నారు. అంతేకాక ఈర్ష్య, ఆసూయలతో మాత్రమే చేసే విమర్శల్ని పట్టించుకోవల్సిన పనిలేదని గట్టిగా వాదించిన ఆప్తమిత్రుల, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తాను ఆ షోని వీడే ఆలోచనను విరమించుకున్నానని స్పష్టం చేశారు. ఇక జబర్ధస్త్‌ని తానుగా వీడే ఆలోచన చేయబోనన్నారు. గత ఐదేళ్లుగా అత్యంత విజయవంతమైన ఈషో వల్ల ఎంతో మందికి వినోదాన్ని తద్వారా ఆరోగ్యాన్ని అందిస్తున్నామన్నారు. దీనితో పాటే గతంలో తాను సమర్పించిన రచ్చబండ టీవీ కార్యక్రమం కూడా మంచి విజయాన్ని సాధించిందని, ఎన్నో కుటుంబాలు కలవడానికి కారణమైందంటూ… అది తిరిగి ప్రారంభమైతే చేసే అవకాశం లేకపోలేదన్నారు. సో… జబర్ధస్త్ అభిమానులకు రోజా విషయంలో ఢోకాలేనట్టే…