వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ… ఇప్పుడు వైసీపీకి మోస్ట్ వాంటెడ్. అదెందుకో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ప్రస్తుతం ఆయన లక్ష్మీస్ ఎన్టీయార్ తీస్తున్నారు. నందమూరి తారకరామారావు అనే తెలుగు వారి టాప్ సెలబ్రిటీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తానని ఆయన తనయుడు బాలకృష్ణ ప్రకటించిన తర్వాత తానే దర్శకత్వం వహిస్తానని ఎవరిని సంప్రదించకుండానే చెప్పేసిన వర్మ… ఈ విషయంలో బాలకృష్ణ తననే మాత్రం పట్టించుకోకపోవడంతో… లక్ష్మీస్ ఎన్టీయర్ను అనౌన్స్ చేశారు.
అసలే వర్మ, అపైన ఎన్టీయార్ జీవితంలోని అత్యంత వివాదాస్పదమైన భాగంపై సినిమా… ఇక అది హాట్ టాపిక్ కాకుండా ఎలా ఉంటుంది? అంతకన్నా మించి… తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి అది నానా రకాలుగా ఇబ్బందులు కలిగించేది కాబట్టి, వైసీపికి వర్మ అత్యంత కావాల్సిన వ్యక్తి కాకుండా ఎలా ఉంటాడు? అందుకే ఇప్పుడు వైసీపీ ప్రచార విభాగం వర్మ జపం చేస్తోంది. సాక్షి మీడియా అయితే ఏకంగా రామ్‌గోపాల్‌వర్మకు గంటల కొద్దీ సమయాన్ని కేటాయించడానికి ఎంత మాత్రం సంశయించడం లేదు. అయితే ఇది వైసీపీకి మరో రకంగా ఇబ్బందికి గురిచేసే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి కారణం గతంలో వర్మ తీసిన వంగవీటి సినిమా.
వంగవీటి సినిమా తీసిన వర్మ… ఆ సమయంలో విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాను రౌడీగా, ముఠా నాయకుడిగా చూపించారు. దీంతో ఆయన తనయుడు వంగవీటి రాధా దీనిపై వర్మతో దాదాపు నేరుగా తలపడినంత పనిచేశారు. వీరిద్దరి మధ్య ఆ సినిమా కారణంగా నెలకొన్న శతృత్వం దమ్ముంటే విజయవాడ దా అంటూ సవాల్ విసిరే దాకా ఆపైన కూడా కోర్టులో కేసు దాకా వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే…కాపు నాయకుడిగా మంచి పేరున్న రంగా అభిమానులు ఆ సమయంలో వర్మపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిసిల్లో చేర్చే అంశంపై కాపుల్లో ప్రభుత్వం పై ఆగ్రహాన్ని అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది వైసీపీ. మరి వంగవీటి శతృవుగా పరిగణిస్తున్న వర్మతో వైసీపీకి ఏర్పడ్డ ఈ అకస్మాత్ అనుబంధంపై కృష్ణాజిల్లా వైసీపీలో ముఖ్య కాపు నాయకుడు అయిన వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో, అది వేరు ఇది వేరే అంటూ ఊరుకుంటారో… పార్టీని ఈ విషయంలో తప్పు పడతారో…వేచి చూడాలి.