జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై ముఖ్యమంత్రి కెసిఆర్ అదేపనిగా విరుచుకుపడటం కేవలం ఎత్తుగడేనంటున్నారు కొందరు టిఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ సవాలు నుంచి, కమ్యూనిస్టుల ఉద్యమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన ఈ వ్యూహం అనుసరిస్తున్నారట. పైగా పదేపదే రాజకీయాల్లోకి రమ్మని రెచ్చగొడితే కోదండరాం త్వరగా పార్టీ పెడతారని అప్పుడు దాన్నే ప్రధాన ప్రత్యర్థిగా చూపించి కాంగ్రెస్‌ను పక్కకు నెట్టొచ్చని అనుకుంటున్నారట. బిజెపి అద్యక్షుడు అమిత్‌షా కేరళలో సిపిఎం హత్యాకాండ పేరిట కార్యాలయాలపై దాడులు చేయడంలోనూ ఇలాటి వ్యూహమే దాగి వుందని టిఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా పోకడల వల్ల సిపిఎం గట్టిగా నిలబడి తన వాదన వినిపించే అవకాశం వచ్చిందనే వాస్తవం మర్చిపోతున్నారు. తెలంగాణలో కోదండరాం ఎవరంటూ దాడి చేయడం ద్వారా కెసిఆర్ కూడా అలాటి ప్రతికూల సంకేతాలే ఇచ్చారన్నది వారి అంచనా. రాజకీయంగా ఎదుర్కొని ఏకాకిని చేసేబదులు చులకనగా మాట్లాడ్డంతో నైతికంగా ఆయన బలోపేతం అవుతున్నారని వారు హెచ్చరిస్తున్నారు. సింగరేణిలో అవతలి వారి తరపున ప్రచారం చేయడంతో ఆగక తమ టిబిజికెఎస్‌కు వేయొద్దని కోదండ చెప్పడమే కెసిఆర్‌ను ఆగ్రహౌదగ్రుణ్ని చేసిందని వారి వివరణ.అయినా సరే అంతటి అసహనాన్నివెళ్లగక్కడం ఎవరికీ మింగుడుపడలేదు. ఇంతకూ ఇప్పుడు కోదండరాం ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా రాజకీయ పార్టీపెడతారనే పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన కూడా అలాటి సంకేతాలే ఇస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ సిపిఐ కోదండరాం పార్టీ ఒక జట్టుగావుంటాయన్నది వారి జోస్యం.