ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వీలైనంతమంది వైకాపా నేతల్ని టీడీపీలోకి ఆకర్షించడమే అధికార పార్టీ వ్యూహం అనేది అర్థమౌతోంది. వైకాపా ఎంపీ బుట్టా రేణుక అధికార పార్టీలో చేరడం ఖరారు అయిపోయింది. అదే జిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యుడు కొత్తపేట ప్రకాష్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బుట్టా రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైకాపా నిర్ణయం ప్రకటించడంతో.. ఆమె టీడీపీలో చేరడం నిశ్చయం అయిపోయింది. జగన్ పాదయాత్ర ముగిసే లోపు మరింత మందిని ఆకర్షించడమే టీడీపీ వ్యూహంగా అర్థమౌతోంది. ఈ విషయం వైకాపాకి కూడా తెలుస్తుంది కదా! ఈ నేపథ్యంలో వలసల్ని నిరోధించేందుకు వైకాపా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటనేవి ఆసక్తికరంగా మారింది. అయితే, వలసలపై జగన్ అభిప్రాయం ఇంకోలా ఉందని అంటున్నారు!
ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఫిరాయించినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు అనేదే జగన్ అభిప్రాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు! కొద్దిమంది వెళ్లినంత మాత్రాన పార్టీకి ఏదో షాక్ తగిలిందని అనుకోవడం పొరపాటు అనే ధీమా వైకాపా నేతల్లో వ్యక్తమౌతోంది. పాత వారు బయటకి వెళ్తే కొత్త వారు వస్తారనీ అవకాశాలు పెరుగుతాయని నేతలు అంటున్నారు. అంతేకాదు, ఇదే తరుణంలో ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతల్ని ఆహ్వానించాలనేది వైకాపా వ్యూహంగా తెలుస్తోంది. పార్టీని విడిచి వెళ్దాం అని డిసైడ్ అయినవారిని ప్రత్యేకంగా బుజ్జగించినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వెళ్లిపోవాలనుకునే వారి గురించి ఆలోచించే కంటే… ఇతర పార్టీల్లో సీనియర్లను వైకాపాలోకి పిలిస్తే బాగుంటుందనేది జగన్ వ్యూహమట! ఇతర పార్టీలంటే ఏపీలో మిగిలి ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కదా. ఇప్పటికే ఉన్న ప్రముఖ నేతలంతా అక్కడి నుంచి దాదాపు ఖాళీ చేసేశారు. కొందరు టీడీపీలోకి వెళ్తే, మరికొందరు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది విశ్రాంతి అంటూ క్రియాశీల రాజకీయాలకు దూరం అయిపోయారు.
వలసల విషయంలో టీడీపీ వ్యూహం ఇప్పటివరకూ ఫెయిల్ కావడం లేదనే చెప్పాలి. అందుకే వైకాపా ఈ వేదాంత ధోరణికి వచ్చేసినట్టుంది. పోయినవాళ్లని పోనీ అని ఈజీగా అనేస్తున్నారు. కానీ, ఈ విషయంలో వైకాపా వైఖరి వ్యూహాత్మంగా లేదనేదే విశ్లేషకుల అభిప్రాయం. పార్టీ పునాదులు పటిష్టంగా ఉండి, సొంతంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు ఏవైనా వలసల విషయంలో ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించొచ్చు. నాయకుల కంటే పార్టీకే ప్రజల్లో బలం ఉందనుకుంటే ఇంత ధీమాగా ఉండొచ్చు. కానీ, వైకాపా ఇంకా ఆ స్థాయికి చేరలేదు కదా. ఒక నాయకుడు పార్టీ మారితే క్యాడర్ కూడా మారిపోతోంది. నేతల కంటే వైకాపాకే ఆదరణ ఎక్కువ అనుకుంటే… నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపా గెలవాలి కదా! పలమనేరులో అమరనాథ్ రెడ్డి పార్టీ వీడాక పరిస్థితి ఎలా మారింది..? ఆదినారాయణ రెడ్డి బయటకి వెళ్లాక స్థానికంగా పరిస్థితులు ఎలా మారాయి..? ఇన్ని అనుభవాలు వారి కళ్లముందే కనిపిస్తూ ఉంటే… నేతలు వెళ్లిపోయినా మాకేం నష్టం లేదన్న ధీమాతో పార్టీ ఉండటం సరైన వ్యూహం కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.