ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈనెల 27న ప్రారంభం కావాలి. కానీ, నవంబర్ 2కి తేదీ మార్చారు కదా. ఎందుకంటే, ఆ రోజు మంచిది కాదని ఎవరో జ్యోతిష్కులు జగన్ కు చెప్పారట అంటూ కథనాలు వచ్చాయి. సరిగ్గా అక్కడి నుంచే ‘జగన్ కీ ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా’ అనే కోణం మొదలైంది. అక్కడితో ఆగలేదు… ఈ మధ్యనే బెంగళూరు వెళ్లి వస్తూ, శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి జగన్ వెళ్లడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా చూశాం. ఇక, పాదయాత్రను కూడా జగన్ ఎలా ప్రారంభిస్తున్నారంటే.. ముందుగా, తిరుమలకు కాలినడకన వెళ్లి, ఆ తరువాత పాదయాత్రకు వెళ్తారట! ఈ వ్యవహార శైలి ఎలా ఉందంటే… హిందూ మత సంప్రదాయలకు జగన్ చాలా విలువ ఇస్తున్నారనే సంకేతాలు వ్యక్తమయ్యేలా ఉంది! హిందూ ఓటర్లను ఎట్రాక్ట్ చేయడం వరకూ ఈ లెక్క సరిపోతుంది. మరి, మిగతావారి సంగతో..?
పాదయాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ కార్యకలాపాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఓపక్క, ప్రత్యేక హోదా పోరాటాన్ని పార్టీ ఇన్ఛార్జ్ లకు ఇతర నేతలకు ఈ మధ్యనే అప్పగించారు. ఇకపై వారే ఆ ఉద్యమాన్ని నడుపుతారట. ఇంకోపక్క, క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించడం, ఎన్నికలకు వారిని సమాయత్తం చేసే బాధ్యతను తన బావ బ్రదర్ అనిల్ కుమార్ కు జగన్ అప్పగించినట్టు కథనాలు వస్తున్నాయి. ఎలాగూ తాను హిందువులకు దగ్గరయ్యాననే విధంగా ఆచార సంప్రదాయలను అనుసరిస్తూ జగన్ సంకేతాలు ఇస్తున్నారు కదా. ఈ ప్రభావం క్రిస్టియన్లపై పడకుండా ఉండే చర్యల్లో భాగంగానే అనిల్ కుమార్ ను తెరమీదికి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఈ వ్యూహంతోనే ఇటీవల సికింద్రాబాద్ లో కొంతమంది పాస్టర్లతో జగన్ సమావేశం అయ్యారట! ఈ కార్యక్రమం ఉండటం వల్లనే విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ కార్యాలయ ప్రారంభానికి జగన్ రాలేదని అంటున్నారు. అన్ని జిల్లాలోని పాస్టర్లని సమాయత్తం చేసి, వైకాపాకి అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతల్ని బ్రదర్ తీసుకున్నారని అంటున్నారు.
‘అవ్వా తాతల్ని మోసం చేశాడు, అక్కా చెల్లెళ్లను మోసం చేశాడు, ఇవేవీ చాలవన్నట్టు మతం పేరుతో రాజకీయం చేస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను’ – మంగళవారం నాడు ధర్మవరంలో జరిగిన ఓ సభలో ప్రతిపక్ష నేత చేసిన విమర్శలు ఇవి. గురివింద గింజ తీరు కబుర్లు అంటే ఇలానే ఉంటాయేమో మరి! ఓపక్క చేయాల్సిన కుల, మత ఓటు మేనేజ్ మెంట్లు చేస్తూ ఇంకోపక్క ఇతరులను విమర్శిస్తే ఏం బాగుంటుంది చెప్పండీ! ఇక్కడ టీడీపీని వెనకేసుకొస్తున్నట్టు కాదు సుమా. అందరూ ఆ తానులో ముక్కలని చెప్పడమే ఉద్దేశం. కులం, మతం పేరుతో రాజకీయం చేయనివారు ఎవరున్నారు చెప్పండి..? మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్య అంటారు అని సివిక్స్ పుస్తకాల్లో చదువు కోవడమే తప్ప, వాటిని ఆచరించేవారు ఎక్కడైనా ఉన్నారా అని వెతకడమనేది జవాబు లేని జల్లెడ పట్టుకుని నీళ్ల పట్టడం లాంటిది.