ఓ వేదికపై ఇద్దరు హీరోలు కనిపిస్తే… పండగే పండగ. అదే.. హీరోలు వెండితెరపై దర్శనమిస్తే.. ఇక చెప్పేదేముంది? ఇద్దరు హీరోలు ఓ ఆడియో పండక్కి వస్తే.. వాళ్లిద్దరూ కలసి నటిస్తే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది. గరుడ వేగ ట్రైలర్ లాంచ్ చూసినా అదే ఫీలింగ్ వస్తుంది. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ట్రైలర్ లాంచ్ కి నందమూరి బాలకృష్ణ అతిథిగా విచ్చేశాడు. బాలయ్య స్పీచ్ అంటే చెప్పేదేముంది? బోల్డంత ఫన్ ఉంటుంది. అయితే ఆ ఛాన్స్ ఈసారి రాజశేఖర్ తీసుకొన్నాడు. బాలయ్యని ‘సార్.. సార్’ అంటూ.. పిలవడం అందర్నీ ఆకట్టుకొంది. ఓ సందర్భంలో ‘బాలయ్య అంత స్పీడుగా నేను చేయలేను’ అని కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా సభికులకు నచ్చింది. ‘మేమిద్దరం ఓ సినిమా చేస్తున్నాం.. ప్రవీణ్ సత్తారు దర్శకుడు.. బాలయ్య హీరో, నాది సైడ్ క్యారెక్టర్, విలన్ అనుకోండి’ అన్నాడు రాజశేఖర్.
దాంతో బాలయ్య కూడా నవ్వేశాడు. రాజశేఖర్ నవ్వులాటగా అన్నా… కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వేదికపై బాలయ్య, రాజశేఖర్ల మధ్య కనిపించిన స్నేహతత్వం.. అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్ సెట్ అయితే అవుతుంది, లేదంటే లేదు, ఇద్దరు సీనియర్ నటుల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణానికి అద్దం పట్టినట్టైంది. ఏమో… బాలయ్య అనుకొంటే ఏదైనా సాధ్యమే. తన సినిమాలో విలన్ గా రాజశేఖర్ని ఎంచుకొన్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ మాటలకు అంత బలముందేమో చూడాలి.