గవర్నర్ పదవి వస్తుందీ వస్తుందీ అని ఎదురుచూడటంతోనే ఆయనకు కాలం గడిచిపోయింది! పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారనీ, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆశతోనే గడచిన మూడేళ్లుగా మోత్కుపల్లి నర్సింహులు ఎదురుచూస్తూ వచ్చారు. చివరి కేంద్రం తనకు కావాలనుకున్నవారినే గవర్నర్లను చేసింది. మోత్కుపల్లికి అవకాశం దక్కలేదు. దీంతో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారనే చెప్పాలి. అయితే, ఈ అసంతృప్తిలో కూడా ఓ చిన్న ఆశ ఏంటంటే… రాజ్యసభ సీటు వస్తుందని! తనకు గతంలో చంద్రబాబు ఈ మేరకు హామీ ఇచ్చారనీ, రాజ్యసభకు పంపిస్తానని అన్నారనీ, తనకు ఆ నమ్మకం ఉందని ప్రస్తుతం మోత్కుపల్లి చెబుతున్నారు. అంటే, ఓ రకంగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టే కదా! ఎలాగూ గవర్నర్ గిరీ ఇప్పించలేకపోయారు కాబట్టి, కనీసం రాజ్యసభకైనా ఆయన పంపిస్తారనేది మోత్కుపల్లి అంచనా.
తెలంగాణలో మూడు, ఆంధ్రాలో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. దీంతో టీడీపీ నేతల్లో ఇప్పటి నుంచే అంచనాలు మొదలైపోయాయి. అయితే, పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయనేది తేలుతుంది కదా! తెలంగాణలో టీడీపీకి ఆశించిన సంఖ్యాబలం లేదు. దీంతో తెలంగాణలో కోటాలో ఒక్క రాజ్యసభ సీటూ దక్కే అవకాశం లేదు. ఏపీలో టీడీపీకి మంచి బలమే ఉంది, కాబట్టి రెండు స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాలకీ ఇప్పటికే చాలా పోటీ నెలకొంది. ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉందనీ, దీంతో ప్రతిభా భారతి, జూపూడి వంటి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీని రాజ్యసభకు పంపిస్తారనే మరో వాదనా ఉంది. సామాజిక సమీకరణ లెక్కల ప్రకారం ఒక రాజ్యసభ స్థానం పోయినా.. రెండో స్థానం తనకు దక్కుతుందనే ఆశాభావంతో మోత్కుపల్లి ఉన్నారు. ఉండటమే కాదు… ఏపీ టీడీపీలోని సహచరులతో ఈ మధ్య తరచూ టచ్ లో ఉంటున్నారనీ, వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తన అభ్యర్థిత్వాన్ని ఏపీ నేతలు కాదనరనేది మోత్కుపల్లి ధీమా.
అయితే, తెలంగాణకు చెందిన మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా రాజ్యసభ సీటుపై కన్నేశారట! తనకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కోరారని సమాచారం! మోత్కుపల్లి ఒక్కరే అనుకుంటే, ఇప్పుడు రావుల కూడా పోటీకి రావడం విశేషం. ఆంధ్రా కోటా నుంచి తెలంగాణ నేతలకు అవకాశం ఉండదని చంద్రబాబు ఇదివరకే స్పష్టం చేశారు. అయినా సరే, మోత్కుపల్లి ప్రయత్నాలు ఆపడం లేదు! తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చే నేతల సంఖ్య పెంచుకుంటే… ఆ తరువాత చంద్రబాబుపై ఒత్తిడి తేవడం సులువు అనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మరి, ఈసారైనా మోత్కుపల్లి ఆశ తీరుతుందో లేదో చూడాలి.