పొట్టివాడు పైగా ద్విముఖుడు, లంబోదరుడు ఛంగున ఎగురలేడు, పరిగెత్తడం అసలే తెలియదు. ఒక దంతాన్ని విరిచేసుకుని ఏకదంతునిగా కనిపిస్తుంటాడు. పైగా బొజ్జకు బెల్ట్ లాగా నాగపామొకటి. ఇలాంటి వాడ్ని సర్వ దేవతా గణాలకు అధిపతిని ఎలాచేశార? ఆ బిగ్ పోస్ట్ కి అతనిలో ఉన్న క్వాలిటీస్ ఏమిటీ, మిగతా వారిలో లేనివేమిటి ? మనలో చాలామందికి బాస్ స్థానంలో ఉన్నవాణ్ణి సినిమాల్లో హీరోలా ఊహించుకుంటాం. దీంతో సదరు బాస్ కూడా అలాగే ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. బాస్ టక్కుచేసుకుని టిప్ టాప్ గా కనిపించాలి. స్టైల్ గా మాట్లాడాలి. ఏసీ ఛాంబర్స్ లో కూర్చుని ఆదేశాలిస్తుండాలి. అదీ నాయకత్వ లక్షణాలని ఎవరైనా అనుకుంటే `తప్పు’లో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ప్రపంచానికి..కాదుకాదు, ఈ సర్వలోకాలకు, యావత్ విశ్వానికి నాయకుడైన గణపతిలో మాత్రమే రియల్ లీడర్ లక్షణాలున్నాయి. కనిపించే రూపురేఖలకంటే, నిశితంగా ఆలోచించే బుద్ధి కుశలతే సర్వజీవులను రక్షిస్తుంటుంది. అఖండ విజయాలను సమకూరుస్తుంటుంది. అదే, అందరికి సుఖశాంతులను పంచిపెడుతుంటుంది. ఈ లక్షణం ఘనంగా ఉన్నందునే శివపుత్రుడే రియల్ బాస్ అంటూ నేటికీ శాల్యూట్ చేస్తున్నాం. ఆయన పుట్టినరోజున వినాయక చవితిగా సంబరాలు జరుపుకుంటున్నాం.
అత్యున్నత పదవి
నాయకుడన్నవాడు సద్బుద్ధితో ఉంటేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అధిపతిగా పదివిరాగానే స్వార్థచింతనతో ప్రజాక్షేమం మరచిపోయేవాడు నిజమైన నాయకుడు ఏనాటికీ కాలేడు. ఎందుకంటే, నాయకత్వమన్నది ఒక పదవికాదు. బాస్ సీట్లో కూర్చున్నవాడు అప్పారావా, పుల్లారావాఅన్నది ఎవ్వరికీ గుర్తుకురాకూడదు. అంతా అతన్ని బాస్ అనే పిలిచే స్థాయికి అతగాడు ఎదగాలి. అంటే, `నాయకుడా…నాయకుడా’ అని ఎప్పుడైతే అంతా పిలవడం మొదలుపెడతారో ఆ క్షణం నుంచి అతను నిజమైన నాయకుడవుతాడన్నమాట. ఇప్పుడు మనం పార్వతీతనయుడ్ని ఎలా పిలుస్తున్నామో చూడండి… `గణనాధుడు’, `గణపతి’, `గణేశ్’, `వినాయకుడు’ అనే కదా. అయితే వీటిలో ఒక్కటీ నిజమైన పేరు కాదు. పదవికి సంబంధించిన పదాలు. సర్వగణాలను అంతగా ప్రేమగా చూసుకుంటున్నాడుకనుకనే డిజిగ్నేషనే అతని పేరుగా మారిపోయింది. మానవ గణం, దైవ గణం చివరకు రాక్షస గణమైనా సరే ఈ గణాలన్నింటినీ కంట్రోల్ చేసే ఒక అధిపతి ఉండాలి. అతనే మహాగణపతి. ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న సందేహం వచ్చింది. ఆదిదేవుడైన శివుని కుమారునికే ఇవ్వాలని అనుకున్నారు. అయితే శివపార్వతులకు ఇద్దరు కుమారులు. ఒకడు పార్వతి నలుగుపిండి నుంచి ప్రాణంపోసుకున్నవాడు.మరొకడు చిన్నవాడు కుమారస్వామి. చివరకు పరీక్షలో అగ్రజునికే ఈ పదవి దక్కింది. అప్పటినుంచి అతనే గణపతి అయ్యాడు. అంతకు ముందు మరి ఈ కుర్రాడ్ని తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులు ఏమని పిలిచారో తెలియదు. బహుశా ఏనుగు శిరస్సుతో తమకు పరమానందం పంచిపెడుతున్న బాలుడ్ని గజాననఅని ముద్దుగా పిలిచేవారేమో.
ఎప్పుడైతే సర్వగణాలకు అధిపతిగా పట్టాభిషిక్తుడయ్యాడో, ఆనాటి నుంచి అతనే వినాయకుడు, గణపతి, గణరాజు అయ్యాడు. ఇక లంబోదర, ఏకదంత,వక్రతుండ, మూషిక వాహన…లాంటివి ఆయన ఆకార, అలవాట్లకు సంబంధించిన పేర్లు. `విష్ణువు’ -ఇది నామవాచకం. `శివుడు’ ఇదే అంతే, కానీ గణపతి అన్నది పేరు కాదు, పనికి తగ్గ డిజిగ్నేషన్. ఇంద్ర శబ్దం కూడా అంతే. ఇంద్రుడు అంటే అది వ్యక్తిపేరుకాదు. ఆ సీట్లో ఎవరు కూర్చుంటే వాడే ఇంద్రుడు. అందుకనే మన పురాణాల్లో కనిపించే ఇంద్రుడు ఎప్పుడూ తన పదవిని కాపాడుకోవడంకోసం ప్రయత్నిస్తుంటాడు. నూరు యజ్ఞాలు చేస్తే ఎవడైనా ఇంద్రుడైపోతాడన్న భయంతో యజ్ఞయాగాదులను చెడగొడుతుంటాడు. అలాంటి వ్యక్తి ఎలా నాయకుడవుతాడు ? మరి మన వినాయకుడు అలాంటివాడుకాదు. ఈ పదవిలోకి వచ్చినమొదలు తన నాయకత్వ ప్రతిభ చూపించి చివరకు అసలుపేరు అంతా మరచిపోయేలా చేశాడు. ఇదీ లీడర్ షిప్ క్వాలిటీ అంటే. అలాంటి లీడర్ మరొకడు మనకు ఎన్నిలోకాలు గాలించినా కనబడడు. ఏ ఆయుధంతోనూ చావకుండా వరంపొందిన రాక్షసుడ్ని తన దంతాన్నే విరిచేసి, దాన్నే ఆయుధంగా మలుచుకుని రాక్షసవధ చేశాడు మహావీర గణపతి. వ్యక్తి స్వార్థంకంటే సమాజశ్రేయస్సే నాయకుడన్నవానిలో పరిపూర్ణంగా ఉండాల్సిన పరమ లక్షణమని మన గణనాథుడు లోకాలకు చాటిచెప్పాడు.
బుద్ధి కుశలత
ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలన్న విషయంలోనే ఎదురైన పరీక్షలో తన బుద్ధికుశలతతో విజయంసాధించాడు. ఎవరైతే యజమాని (యాజమాన్యం) పెట్టిన పరీక్షల్లో నెగ్గుతాడో అతనే పూర్తి విజయం సాధించినట్టులెక్క. పైకి కనిపించే ఆకారంకంటే బుద్ధికుశలత ఉంటే సర్వలోకాలు గౌరవిస్తాయనీ, అగ్రపూజలు అందుకోవచ్చనడానికి గణపతే ప్రత్యక్షసాక్షి. లీడర్ లేదా బాస్ నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? లావుపాటివాడా, సన్నగా ఉంటాడా ? ఇలాంటి బాహ్యలక్షణాలనుబట్టి అంచనావేయకూడదు. అందర్నీ కలుపుకుంటూ, ఎవ్వరినీ నొప్పించకుండా వెళ్లగలగడమే గొప్ప.
కనుక, పొట్టివాడుకావచ్చు, ద్విరూపుడు కావచ్చు, కానీ శివపుత్రుడు తన తెలివితేటలతో లోకకల్యాణం కావించాడుకనుకనే ఆయనే రియల్ లీడర్. నాయకుడనేవాడు ఎలా ఉండాలో చాటిచెప్పాడుకనుకనే ఆయన పుట్టినరోజును మనమీనాడు ఘనంగా జరుపుకుంటున్నాం. సర్వేజన సుఖినోభవంతు అన్నదే వినాయక సంకల్పం.
-కణ్వస