టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతాడా లేదా అని అనేక వూహాగానాలు నడుస్తున్నాయి. నిజానికి అవి కూడా ఆఖరిదశలో వున్నాయి. ఎందుకంటే అగ్గిబరాటా లాటి రేవంత్‌కు ఆ ఉద్దేశమే లేకపోతే ఈ ప్రచారాలను ఇప్పటికే చీల్చిచెండాడేవారు. ప్రసారాలు చేసిన మీడియాను తిట్టిపోసేవారు. ఆయన ఆ బాటలో వున్నారు కాబట్టే, చాలా కాలంగా ఈ తతంగం నడుస్తున్నది కాబట్టే.. ఏవో నామకార్థపు వివరణలు ఖండనలతో సరిపెడుతున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లిన మాట నిజమే.. కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్న మాటా నిజమే. రాహుల్‌గాంధీతో రేవంత్ మాట్లాడుతున్న విజువల్స్ మా దగ్గరున్నాయని టిడిపి సీనియర్ నాయకులు కొందరు మీడియాతో చెబుతున్నారు. పైగా రాహుల్ గాంధీ రేవంత్‌కు అనుకున్నంత సమయం ఇవ్వలేదని మొక్కుబడిగా ముగించారని కూడా మీడియా దగ్గర సమాచారం వుంది. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చినా రేవంత్‌ను కలుసుకునే అవకాశం ఇవ్వకపోవడం మరో విశేషం. ఇదంతా మారుతున్న పరిస్తితిని సూచిస్తుంది.చంద్రబాబు విషయం వేరు. కాని రాహుల్ ఎందుకు తగినంత సమయం ఇవ్వలేదంటే అది కాంగ్రెస్ పద్ధతి. ఎవరినైనా రాజకీయంగా లోబర్చుకునేవరకు ఒక విధంగా వుంటుంది. వచ్చిన తర్వాత వేరుగా వుంటుంది. కెసిఆర్ వంటివారికే ఈ అనుభవం తప్పలేదు. ఇప్పుడు రేవంత్ వంతు. అంతే. ఈ లోగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి వర్గీయులు తమ స్థానాలు బలపర్చుకునే పనిలో పడ్డారట.