ఇది మోడ్రన్ యుగం. ఇంకా కులాల పేరిట కొట్లాటలూ, రాధ్ధాంతాలూ ఏమిటి? ట్రాష్ అనుకునే ఆధునికులు ఎవరైనా ఉంటే వారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను సరిగా గమనించడం లేదన్నట్టే. ఎప్పుడూ కొద్దో గొప్పో కుల ప్రభావం ఉండే పరిస్థితి నుంచి ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో కుల రాజకీయం ఆంధ్ర, తెలంగాణల్లో రాజుకుంటోంది. ఓ రకంగా చెప్పాలంటే… రానున్న ఎన్నికలు పూర్తిగా, పచ్చిగా కుల ప్రాతిపదికన జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కుత కుత…కులాంధ్ర…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించే రెండు సామాజిక వర్గాలు రెడ్డి, కమ్మ. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేదికగా ఈ రెండూ ఆధిపత్యం కోసం నిరంతరం పోరాడుతూంటే మిగతా కులాలు సందర్భాన్ని బట్టి అటో ఇటో మొగ్గుతూ రావడం రివాజు. అయితే నిన్నా మొన్నటి దాకా ఇదంతా కాస్త గుంభనంగానే జరిగేది. కాని ఇప్పుడు మొత్తం బహిరంగమే. అంతేకాక అన్ని కులాలూ కాక మీదే ఉన్నట్టు కనపడుతోంది. ఎప్పటిలాగే సంప్రదాయంగా రెడ్డీ, కమ్మ కులాలు ఢీ అంటే ఢీ అంటూంటే, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి లాంటి వాళ్లు ‘రెడ్డీస్‌కి జగన్ ఏం చేస్తాడు? రెడ్డీ కులస్థులూ… అతడ్ని నమ్మొద్దు’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూన్నారు. ఇక ఆంధ్రలో నిర్ణయాత్మక ఓటు బ్యాంకుగా ఉన్న కాపు కులస్థులను, బిసిల అంశాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోసే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. గత ఎన్నికల్లో పరోక్ష ప్రభావం చూపిన పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగానే పోటీకి సై అంటున్న నేపధ్యంలో ఆయన అవునన్నా కాదన్నా కాపు కులం ఆయనను తమ నాయకుడిగానే చూస్తుంది. ఇక కంచె ఐలయ్య పుస్తకం రగిల్చిన చిచ్చు వైశ్యుల్లో కాక రేపింది. టిజి వెంకటేష్ లాంటి సీనియర్ ఎంపి కూడా తమ కులం తరపున పచ్చి కులతత్వ వాదుల్లా మాట్లాడే పరిస్థితి తెచ్చింది. ఓట్ల కోసం కొన్ని కులాలను నెత్తికెత్తుకునే నేతలు తమను పట్టించుకోవడం లేదనే భావన తో వైశ్యులు ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఎక్కారు. వీరి ఐక్యత తప్పకుండా రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపించక మానదు. మరోవైపు ఐవిఆర్ కృష్ణారావు వంటి వారు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి వైదొలగుతూ… తమ కులానికి అవమానం కలుగుతుందనే రీతిలో మాట్లాడడం… చూశాం. ఇక మందకృష్ణ మాదిగ నిరంతరం కురుక్షేత్ర సభలంటూ అలజడి సృష్టిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఎపిలోని రెండు ప్రధాన పార్టీలూ ఈ కులచిచ్చును ఆర్పే ప్రయత్నం కన్నా వీలైనంత చలికాచుకునేందుకే తహతహలాడుతున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో… వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయ కలకలానికి వేదికగా మారే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
‘తెగ’పంచాయితీ… తెలంగాణ
ఎపితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కులరాజకీయాలు చాలా తక్కువేనని చెప్పాలి. ఈ మాట సాక్షాత్తూ సిఎం కేసియార్ ఇటీవలే అన్నమాట. ఒకప్పుడైతే ఇది ఉన్నమాటే. కాని ఇప్పుడిప్పుడే అది నిన్నటిమాటగా మారుతోంది. ఉద్యమాలు, ఆరాట పోరాటాల నేలగా పేరు పొందిన తెలంగాణలో… అనూహ్యంగా కుల రాజకీయాలు రాజుకుంటున్నాయి.ప్రొఫెసర్ కోదండరాం సహా… ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంపై ఆధిపత్యం సాధించే క్రమంలో అధికార పార్టీ వెలమ, కమ్మ కులస్థుల ఐక్యతకు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే ఎపిలో ఉన్న కొందరు రాజకీయనేతలతో సైతం దోస్తీ కట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ తెచ్చింది వెలమ కులస్థులే అంటూ వివాదాలకు కారణమవుతున్నారు తెరాస ముఖ్యనాయకులు. ఈ పరిస్థితిని గమనిస్తూన్న రెడ్డి కులస్థులు సహజంగానే గట్టిగా స్పందిస్తున్నారు. తాజాగా జగ్గారెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు చూస్తే తెలంగాణ రాజకీయం ఏ వైపు పయనించనుందో తేలికగానే అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో తమ కులంపై ఆధిపత్యం చెలాయించాలని, అణగదొక్కాలని చూస్తే తామంతా కలిసి సత్తా చూపిస్తామని ఆయన బహిరంగంగానే కెసియార్‌ను హెచ్చరించారు.. మరోవైపు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తమవైపు లాక్కుండడం… వంటి పరిణామాలు చూస్తుంటే తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల నాటికి కుల ఆధారిత పోరు తప్పదని అనిపిస్తోంది.
ఏదేమైనా సమాజాన్ని కుల, మత పిచ్చికి వ్యతిరేకంగా అభ్యుదయ, అభివృద్ధి పంధాలో మాత్రమే నడపాల్సిన రాజకీయ నేతలు తాత్కాలిక లబ్ధికోసం సిగ్గు విడిచి అమలు చేస్తున్న కుల వ్యూహాలు… అన్ని విధాల గర్హించదగినవే.