టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అని రేవంత్ రెడ్డిని గురించి మరెన్ని రోజులు రాయొచ్చో తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్ ఆధారంగా పార్టీ మారే అవకాశాలున్నాయని దాదాపు అందరూ ప్రసారాలు చేశారు. అయితే ఈ ఆఖరి నిముషంలో కూడా ఆయన సూటిగా ఆ సంగతి చెప్పడానికి సిద్ధపడలేదు. కలసిపనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్‌తో కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తూనే కోర్టుకేసుల కోసం వెళ్లినట్టు చెప్పారు. ఆఫ్ ద రికార్డుగానైనా తన మనోగతం వెల్లడించలేదు. కాకుంటే ఎపి మంత్రులపైన పరిటాల శ్రీరాంపైన విమర్శలు చేశారు గనక పార్టీ నుంచి దూరమవుతున్నట్టు భావించవచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ నుంచి ఏదైనా షరతులు సాధించాలనుకుంటున్నారా? తెలుగుదేశం కోణంలో చూస్తే ట్రబుల్ షూటర్ వంటి అరవిందకుమార్ గౌడ్ రేవంత్‌పై దాదాపు దాడి చేశారు. అంత కీలక స్థానంలోవుండి ఇలాటి కథనాలకు ఆస్కారమివ్వడం సరికాదన్నారు. అయితే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కీలక నాయకుడు లోకేశ్ మాత్రం ఇంకా ఇవన్నీ వూహలేనంటూ కొట్టివేయడం విచిత్రం. పైగా పార్టీలో మరో ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్యను కలిశారు కూడా. బిసి నేత కృష్ణయ్య ఎలాగూ టిడిపిలో సీరియస్ కాదు. కొంతమంది నో కామెంట్ అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు స్వాగతిస్తే కొందరు సణుగుతున్నారు. టిఆర్ఎస్ నాయకులు తీసి పారేస్తున్నారు. కథ ఇక్కడి దాకా వచ్చినా టిడిపి అధిష్టానం గట్టిగా మాట్లాడలేకపోవడం బలహీనతనే సూచిస్తుంది.