కర్నూలు టీడీపీ వర్గాల్లో దీపావళి టపాసులు పేలుతున్నాయి..! అంటే, వైకాపా ఎంపీ బుట్టా రేణుక రాకతో చేసుకుంటున్న సంబరాలు అనుకుంటే పొరపాటే. ఆమెని పార్టీలోకి చేర్చుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రేణుకను ఏ ఉద్దేశంతో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే క్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీద కర్నూలు జిల్లా టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం! బుట్టా రేణుక టీడీపీలో చేరితే… మధ్యలో ఈయనపై ఆగ్రహం ఎందుకూ అనుకుంటున్నారా..? అసలైన వ్యవహారం తెరవెనక ఆయనే నడిపించారట!
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి రావడం అనేది ఏదో హఠాత్పరిణామం కాదు. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆమె రాక డిసైడ్ అయిపోయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరి, పచ్చ కండువా కప్పుకున్నారు. అదే సమయంలో బుట్టా రేణుక కూడా వెంటే ఉన్నారు! కానీ, సాంకేతికంగా ఆమె టీడీపీలో చేరలేదు. అలాగని తాను టీడీపీ వైపు వెళ్లను అని కూడా ఖండించలేదు. మూడున్నరేళ్ల తరువాత, సరిగ్గా ఎన్నికలకు మరో ఏడాదిన్నరే సమయం ఉన్న ఈ తరుణంలో… రేణుకను పార్టీలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆమెకే అని చంద్రబాబు హామీ ఇవ్వడంపై కర్నూలు టీడీపీ వర్గాలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. బుట్టాను పార్టీకి చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు.. సీఎం రమేష్. ఆయనే దగ్గరుండి మంత్రాంగం నడిపారు! ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతున్న కర్నూలు జిల్లా టీడీపీలోకి రేణుకను తెచ్చి, సీఎం రమేష్ కొత్త చిచ్చుకు కారణం కాబోతున్నారంటూ కొంతమంది తమ్ముళ్లు ఆఫ్ ద రికార్డ్ మండిపడుతున్నారు!
బుట్టా రేణుకకు సొంతంగా కేడర్ అంటూ లేదు. గత ఎన్నికల్లో జగన్ హవా మీద నెట్టుకొచ్చారు. ఇప్పుడు టీడీపీలో ఆమె చేరినా, స్థానిక నేతలు ఆమెకు ఎంతవరకూ సహకరిస్తారనేది కూడా చర్చనీయాంశమే. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసేందుకు కేయీ కృష్ణమూర్తి కూడా ఆసక్తి చూపిస్తున్నారట! ఈ విషయాలన్నీ సీఎం రమేష్ కు తెలియవా..? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అర్థం కానివా అనేది కొంతమంది తమ్ముళ్ల అంతర్మథనం. ఇంతకీ, ఏ ప్రాతిపదికన ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనేది స్థానిక టీడీపీ నేతల్లో వ్యక్తమౌతున్న ప్రశ్న. నంద్యాల ఉప ఎన్నికల ఫలితంతో జిల్లాలో టీడీపీ బలోపేతం అవుతోందన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. నేతలంతా ఎంతో శ్రమించి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలాంటి తరుణంలో బుట్టాని చేర్చుకోవడం ద్వారా దశాబ్దాలుగా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఏం సందేశం ఇచ్చినట్టు..? మొత్తానికి, బుట్టా రేణుక చేరిక తరువాత కర్నూలు టీడీపీ రాజకీయాల్లో కొత్త సమస్యలు వచ్చేలానే కనిపిస్తున్నాయి.