రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా రాజకీయాలన్నీ విజయవాడ కేంద్రంగా సాగడం మొదలైంది. అందరికంటే ముందుగా అధికార తెలుగుదేశం పార్టీ మకాం మార్చేసింది. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడం మొదలుపెట్టింది. అధికార పార్టీ కాబట్టి, ముఖ్యమంత్రి కార్యాలయాలు, ఇతర మంత్రుల ఆఫీసుల్లో పార్టీ నేతలు ఎప్పటికప్పుడు భేటీ అయ్యే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది. కానీ, ప్రతిపక్షానికి ఆ పరిస్థితి నిన్నమొన్నటి వరకూ లేదు. పార్టీకి సంబంధించి ఏ సమావేశం జరపాలన్నా హైదరాబాద్ కి వెళ్లాల్సిందే. ప్రతిపక్ష నేత జగన్ కూడా హైదరాబాద్ కే పరిమితం అవుతూ ఉండటం, అక్కడి నుంచే కార్యకలాపాలు సమీక్షించేందుకు ఇష్టపడుతూ ఉండటంతో పార్టీ నేతల్లోనే ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతూ ఉండేది. అయితే, ఇటీవలే విజయవాడలో వైకాపా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేశారు. దీంతో ఇకపై జగన్ తమకు అందుబాటులోకి వచ్చేస్తారని వైకాపా వర్గాలన్నీ సంతోషించాయి. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా కనిపిస్తోంది!
ఆంధ్రాలో ఆఫీస్ ఓపెన్ చేశారుగానీ… ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే పనులు చక్కబెట్టేందుకు జగన్ ఇష్టపడుతూ ఉన్నారట! కార్యాలయం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి జగన్ విజయవాడకు ఇటీవలే వచ్చారు. దాంతో ఓ రెండ్రోజులపాటు ఆయన ఇక్కడే ఉంటారని, కేడర్ తో మాట్లాడతారని అనుకున్నారట! కానీ, వచ్చీ రావడంతో బీసీ సంఘాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది పూర్తయిన మరుక్షణమే హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నానికే ఆఫీస్ ఖాళీ అయిపోయింది. దీంతో వైకాపా కార్యకర్తలు కాస్త అసంతృప్తికి గురయ్యారట. అంతేకాదు.. మళ్లీ విజయవాడ ఆఫీస్ కి జగన్ ఎప్పుడు వస్తారనేది కూడా ఎవ్వరికీ తెలీదని అంటున్నారు! త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహించబోతున్నారు. పార్టీకి సంబంధించి ఇది అంత్యంత కీలకమైన కార్యక్రమం. ఈ నేపథ్యంలో జరిగే సమావేశాలూ మంతనాలూ అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయనీ, ఇలాంటి కీలక సమావేశాలు ఏపీ కార్యాలయంలో జరిగితే ఇక్కడి కేడర్ కు ఉత్సాహం ఉంటుంది కదా అని కొంతమంది నేతలు వాపోతున్నారు.
ఆంధ్రాలో ప్రతిపక్ష కార్యాలయం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శల్ని తిప్పి కొట్టడం కోసమే అన్నట్టుగా ఓ భవనంలో ఆఫీస్ ప్రారంభించేశారు. అదో ప్రాంతీయ కార్యాలయంగానే ప్రస్తుతానికి కనిపిస్తోందే తప్ప, ప్రధాన కార్యాలయం అనే భావన వైకాపా అధినాయకత్వానికి లేనట్టుగా ఉందనేది కొందరి అభిప్రాయం! విజయవాడ ఆఫీస్ ని అశ్రద్ధ చేస్తే మరిన్ని విమర్శలు చేసేందుకు అధికార పార్టీకి మరో అస్త్రం అందించినట్టే అవుతుందనేది వైకాపా వర్గాల ఆవేదన. మరి, ఈ విషయం అధినాయకత్వానికి అర్థం అవుతుందో లేదో! ఏదేమైనా, ఇప్పట్లో విజయవాడకు మకాం మార్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు.