ఎపి ప్రభుత్వంలో నారాయణ, గంటా శ్రీనివాసరావు, లేదా కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటివారిపై ఏవో ఆరోపణలూ వివాదాలు రావడం కొత్త కాదు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఏదైనా చెప్పగల సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుపై వ్యక్తిగత ఆరోపణల దుమారం లేదు. కాని ఇప్పుడు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి 2000 కోట్ల విలువైన కాంట్రాక్టులను అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర ఆయన తమ్ముడు తీసుకున్నాడని ఎంఎల్ఎ రేవంత్ రెడ్డి ఆరోపించడం ఒక కుదుపే. రేవంత్పార్టీ మారడానికి ఇవన్నీ చెబుతున్నారనీ, కాంట్రాక్టులు తప్పు కాదని ఎన్ని సమర్థించుకున్నా రాజకీయాల వెనక వ్యాపార వ్యవహారాలు సాగిపోతున్నాయని ఒప్పుకోక తప్పని స్థితి వచ్చింది.దీనిపై ఆయన ఇంతవరకూ ఏమీ మాట్లాడకపోవడమే గాక పార్టీ నాయకత్వం కూడా ఖండించలేదు. మంత్రి దేవినేని ఉమ కూడా దాటేశారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సిఎంరమేష్పై పార్టీ వారినుంచే కొన్ని విమర్శలు వస్తే ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నారు. పరిటాల సునీత కుమారుడు శ్రీరాం కూడా కెసిఆర్ సౌజన్యంతో లాభం పొందారని రేవంత్ అంటున్నారు.వీటిపై ఏదో ఒకటి మాట్లాడవలసిన బాధ్యత టిడిపిపై వుంది. వారు చెప్పేదే నిజమనుకోవలసిన అగత్యం ప్రతిపక్షాలకూ ప్రజలకూ వుండదు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ ఆరోపణలు శాసనసభలోనూ కలకలం సృష్టిస్తాయి. ఆర్థిక శాఖతో పాటు సభా వ్యవహారాలు కూడా యనమల చూస్తారు గనక వైసీపీ దీన్ని ఉపయోగించుకోకుండా వుండదు.