అక్ఠోబరు 27న తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తొలగిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీ వారు ఆలోచిస్తున్న ప్రశ్న. గతంలో ఫిరాయింపులపై పోరాడ్డమే గాక కోర్టుకు కూడా వెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తనే ఫిరాయించితే సమర్థించుకోవడం కష్టం. పైగా ప్రభుత్వం కూడా వ్యతిరేకం గనక అనర్హత వేటు వేసినా వేయొచ్చు. మిగిలిన ఇద్దరు కూడా మారితే అదో పద్ధతి కాని ఆర్.కృష్ణయ్య ఏం చేస్తారో తెలియదు. ఈ పరిస్తితుల్లో తెలుగుదేశం అధిష్టానమే రేవంత్‌ను సస్పెండ్ చేస్తే అప్పుడు ఆయన హాయిగా అనర్హత బెడద లేకుండా పార్టీ మారొచ్చు. ఎపి మంత్రులనే గాక పొత్తుల సంగతి తేల్చని అధిష్టానాన్ని కూడా రేవంత్ సూటిగానే విమర్శించారు. కాబట్టి తనపై చర్య తీసుకోకుండా తటపటాయించడమేమిటని కొందరు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ గజిబిజిలో శాసనసభలో ఆయన పార్టీ విధానాన్నే చెబుతారని నమ్మకం ఏమిటని కూడా సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఏమైనా రేవంత్ తన వంతు చెప్పాల్సింది చెప్పారు. ఇక బంతి చంద్రబాబు నాయుడు కోర్టులేనే వుందని చెప్పాలి.