చిరంజీవి పుట్టినరోజున లాంఛనంగా ప్రారంభమైన ‘సైరా నరసింహారెడ్డి’ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా?? అంటూ మెగా అభిమానులతో పాటుచిత్రసీమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీపావళికి ముందు మంచి ముహూర్తాలు లేవన్నకారణంగా షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చారు. మరోవైపు సెట్స్ కూడా సిద్దం కాలేదు. స్వాతంత్ర్యోద్యమం కాలంనాటి వాతావరణం ప్రతిబింబించేలా సెట్స్‌ని రూపొందించాల్సివచ్చింది. అందుకోసం కాస్త రీసెర్చ్ కూడా చేయాల్సివుంది. కాస్ట్యూమ్స్, ఆయుధాల రూపకల్పన వీటి కోసంఎక్కవ సమయం కేటాయించారు. అందుకే `సైరా` సైరన్ మోగడానికి టైమ్ పట్టింది. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇక చిరుదే ఆలస్యం. దీపావళి పండుగ చేసుకొని, మరుసటి రోజు షూటింగ్ మొదలెట్టాలని చిత్రబృందం భావించింది. అంటే..ఈరోజే క్లాప్ కొట్టాలన్నమాట. కానీ… చిరు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ఖైది నెం.150 కోసం చిరు బరువు తగ్గి, కాస్త స్లిమ్‌గా కనిపించారు. సైరాకి తన బరువు మరింత తగ్గించాలనుకొన్నారు. దానికితగ్గట్టే కసరత్తులు మొదలెట్టినా అనుకొన్న పలితం రాలేదని తెలుస్తోంది. గతనాలుగు వారాల నుంచి చిరు పూర్తిగా డైట్లో ఉన్నారని, ప్రత్యేక వ్యాయామాలుచేస్తున్నారని తెలుస్తోంది. సైరా పాత్రకుతగ్గట్టు జుత్తు కూడా భారీగా పెంచుతున్నార్ట. సైరా పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలచుకొన్న తరవాత…సైరా సెట్లో అడుగుపెడతారట చిరంజీవి. చిరు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేది ఎప్పుడా అనిచిత్రబృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బహుశా నవంబరు మొదటి వారం నుంచి సైరా సెట్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.