యేడాది క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు కచ్చితంగా జగనణమన గీతం ప్రదర్శించాల్సిందే, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడాల్సిందే అని. ముందు ఈ నిబంధనపై భిన్న స్వరాలు వినిపించినా, క్రమంగా అందరూ జగనమణగీతానికి అలవాటు పడిపోయారు. అయితే ఈ నిబంధన సరికాదని, దీన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్లు వేస్తూనే ఉన్నారు. దీనిపై సర్వోన్నత న్యాయ స్థానం కూడా స్పందించింది. సినిమాకి కేవలం వినోదం కోసమే వెళ్తారని, అక్కడ జాతీయ గీతం ప్రస్తావన తీసుకురావల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. క్రీడా సంరంభాల్లో ఎలాగూ.. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు కదా, థియేటర్లలో ఎందుకు అని ప్రశ్నించింది. అంతేకాదు… జనగణమన ఆలపిస్తున్నవారిలో సగం మందికి పైగా ఆ గీతానికున్న ప్రాధాన్యత, అర్థం తెలీదని అలాంటప్పుడు గీతాన్ని తప్పని సరి చేయాల్సిన అవసరం ఏముందని సూటిగానే ప్రశ్నించింది. జాతీయ గీతాన్ని ఆలపిస్తేనే దేశభక్తి ఉన్నట్టా?? దేశం మీద ప్రేమ అనేది స్వతహాగా పుట్టాల్సిందే, దాన్ని బలవంతంగా రుద్దలేం అని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ విషయమై పునరాలోచించాలని, లేదంటే.. కనీసం సవరణ అయినా తీసుకురావాలని కేంద్రానికి ఆదేశించింది. ఇక మీదట థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించినా, ఆ సమయంలో లేచి నిలబడాలా, వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టానికి వదిలేసే అవకాశాలున్నాయి. మరి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.