రామ్.. హుషారుకి కేరాఫ్ అడ్రస్స్. హైపర్ యాక్టీవ్ క్యారెక్టర్లతో యువతరానికి ప్రతినిధి పాత్రల్లో అల్లుకుపోయి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న కథానాయకుడు. లవ్ స్టోరీలు, మాస్ కథలు, ఫ్యామిలీ డ్రామాలూ ఇవన్నీ రామ్‌కి బాగా సూటైపోతాయి. ఈమధ్య లవ్ స్టోరీలకు బాగా కనెక్ట్ అయ్యాడు. ‘నేను – శైలజ’తో ఓ మంచి హిట్ కొట్టిన రామ్.. ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రామ్‌తో తెలుగు 360 చేసిన చిట్ చాట్ ఇది.
* గెడ్డం మీకు బాగా కలిసొచ్చిందేమో. అప్పుడు నేను శైలజ.. ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీలో దేవదాసు టైపు గెటప్‌లో కనిపిస్తున్నారు..
– (నవ్వుతూ) రెండు సినిమాల్లోనూ గెడ్డం ఉంది. కాకపోతే.. ఆ స్టైల్స్ వేరు. దాంతో పాటు ఈ కథలూ వేరు. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నేనో కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తా. కాలేజీ కుర్రాడంటే… అలానే ఉంటాడు కదా? వాడి గెడ్డం, వాడి స్టైల్.. అంతా వాడి ఇష్టం. ఇంట్లోవాళ్లు కూడా `ఏంట్రా ఈ అవతారం` అనేలానే బిహేవ్ చేస్తుంటాడు. కాబట్టి అలాంటి గెటప్‌లో కనిపించాల్సివచ్చింది.
* నేను శైలజతో హరికీ, ఈ సినిమాలోని అభిరామ్‌కీ పోలికలేంటి?
– అస్సలు ఒక్క విషయంలోనూ పోలిక ఉండదు. అభిరామ్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంటాడు. జీవితాన్ని చాలా సింపుల్‌గా తీసుకొనే మనస్తత్వం తనది. ఫ్రెండ్ షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు. ఇలాంటి ఫ్రెండ్ ఒకడుంటే జీవితంలో మరేం అవసరం లేదనిపించేలా అతని పాత్ర ఉంటుంది. అభిరామ్ ఒక విధంగా రోల్డ్ మోడల్ లాంటి క్యారెక్టర్.
* ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..
– అభిరామ్ బాల్యం, యవ్వనం, ఆ తరవాత దశ.
* లవ్‌కి ప్రాధాన్యం ఇచ్చారా? లేదంటే స్నేహానికా?
– అది చెబితే.. క్లైమాక్స్‌లో కిక్ ఉండదు. ఈ సినిమా చూశాక అభిరామ్ దేని వైపు మొగ్గు చూపించాడన్నది మీకే తెలుస్తుంది.
* కిషోర్ తిరుమలతో వరుసగా రెండో సినిమా. అంచనాలు పెరిగిపోతాయి కదా?
– నేనెప్పుడూ అంచనాల గురించి ఆలోచించను. అది దర్శక నిర్మాతల పని.
* నేను శైలజ తరవాత మార్పు వచ్చినట్టేనా?
– నేనేం మారలేదండీ. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నా. హైపర్, శివం, నేనూ శైలజ ఈ కథలన్నీ దాదాపుగా ఒకే సమయంలో విని ఓకే చేసినవే. ఒక్కో సినిమా రిజల్ట్ ఒక్కోలా ఉందంతే.
* ఇలాంటి కథలు ఇక చేయకూడదని ఫిక్సయిపోవడం లాంటివేం ఉండవా?
– ఓ కథ వింటున్నప్పుడు బుర్రలో వేరే రకమైన ఆలోచనలు పెట్టుకోను. ఏ జోనర్ కథ వింటున్నా, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇలాంటి విషయాలేం ఆలోచించను. దాదాపుగా టాక్ తెలుసుకోకుండా సినిమాకి వెళ్లిన ఓ ప్రేక్షకుడిలానే అన్నమాట. కథ నాకు నచ్చితే వెంటనే ఓకే చేసేస్తుంటా.
* సెకండ్ ఒపీనియన్ తీసుకోరా?
– మా పెదనాన్న గారున్నారు కదా? ప్రతీ విషయాన్నీ ఆయనతో షేర్ చేసుకొంటా. ఆయన, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాం. కథ నాకు నచ్చి ఆయనకు నచ్చకపోయినా కన్వెన్స్ చేస్తా. ఆయనకు నచ్చి నాకు నచ్చకపోయినా నన్ను కన్వెన్స్ చేయగలిగితే ఒప్పుకొంటా. మా ఇద్దరి మధ్యా జరిగే డిబేట్ అంటే నాకు చాలా ఇష్టం. అంతిమ నిర్ణయం మాత్రం నాదే.
* రాజా ది గ్రేట్ కథ ముందు మీకే వినిపించారు. దానికి నో చెప్పడానికి కారణం ఏమిటి?
– చేద్దామనుకొన్నా కానీ కుదర్లేదు.
* ఈ మధ్య కాస్త ఎక్కువగానే గ్యాప్ తీసుకొంటున్నారు..
– కథల కోసమేనండీ. నన్ను ఉత్సాహ పరిచే కథ చెబితే వెంటనే ఆ సినిమా పట్టాలెక్కిస్తుంటా. `ఉన్నది ఒకటే జిందగీ` తరవాత మరో కథ ఎప్పుడు సెట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను.
* మల్టీస్టారర్‌కి సిద్ధమేనా?
– మసాలా చేశా కదా? అలాంటి కథలొస్తే తప్పకుండా నటిస్తా.