పాదయాత్ర ప్రారంభానికి ముందు వైసీపీ అధినేత జగన్ ఈనాడు పితామహుడు రామోజీరావును కలుసుకోవడం సోమవారం మీడియాలో పెద్ద వార్త. దానిపై వ్యాఖ్యలు కూడా పరిపరివిధాల వచ్చాయి. కాని విచిత్రంగా జగన్ కు సంబందించిన సాక్షిలో గాని, రామోజీ ఈనాడులో గాని ఈ వార్త కనిపించలేదు. జగన్ యాత్ర, కోర్టు తీర్పు గురించి వైసీపీ సమావేశాల గురించి వివరమైన కథనాలే వున్నాయి. కాని ఇది మాత్రం నాకు కనిపించలేదు. పొరబాటుపడతానేమోనని ఒకటికి రెండు సార్లు చూశాను. లాభం లేకపోయింది.ఇప్పటికైనా ఎవరైనా చూపిస్తే దిద్దుకోవడానికి సిద్ధమే. ఇది మర్యాద పూర్వక భేటీ అయితే ఆ మేరకే ఇచ్చివుండొచ్చు. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన అంశాలను అమితంగా సేకరించి ఫోకస్ చేసేవారు తమకు సంబంధించిన అగ్రగాముల కలయికను ఎందుకు ఇవ్వనట్టు? అర్థం గాని ప్రశ్న. అంతర్గత సమావేశం అనుకుంటే అప్పుడు ఇంకా ప్రాధాన్యత వస్తుంది. కలిసినా ప్రాధాన్యత లేదనడం కూడా పొరబాటుగా వుంటుంది. ఏమైనా తెలుగు మీడియాలో చూస్తున్న తమాషా విషయాల్లో ఇదేమంత పెద్దది కాదు. కాకపోతే ఎవరి కోణంలో వారు చేస్తుంటారు. గతంలో ఆ రెండు పత్రికలు అని వైఎస్ రాజశేఖరరెడ్డి అనేవారు. ఇప్పుడు ఈ కథనం విషయంలో ఈ రెండు పత్రికలూ ఇవ్వలేదుగాని అప్పటి రెండవ పత్రిక మాత్రం బాగా ఇచ్చింది.