తమిళ హీరో విశాల్ తన మీద ఎలాంటి దాడులు జరిగినా బెదిరేది లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా మెర్సల్ సినిమా కేంద్రంగా నడుస్తున్న వాదోపవాదాలు విశాల్ మీద ఆదాయపు పన్ను అధికారుల దాడులతో వేడెక్కిన నేపధ్యంలో… దీనిపై సోమవారం విశాల్ స్పందించాడు.
నిజానికి ఈ దాడుల విషయంలో తొలుత కొంత గందరగోళం చోటు చేసుకుంది. ఇంటర్నెట్లో మెర్సల్ చూశానని అన్న భాజాపా నేత హెచ్.రాజాపై విశాల్ అదేం పనంటూ విరుచుకుపడిన అనంతరం ఒక్క రోజు వ్యవధిలోనే విశాల్ ఆఫీస్‌పై జిఎస్టీ అధికారులు దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అలాంటిదేం జరగలేదని జిఎస్టీ అధికారులు ఖండించారు. అయితే ఆదాయపు పన్ను ఆధ్వర్యంలో సాధారణ తనిఖీలు జరిగాయని విశాల్ కార్యాలయం సో్మవారం ఉదయం తెలియజేసింది.
ఈ నేపధ్యంలోనే సోమవారం మధ్యాహ్న సమయంలో దీనిపై స్పందించిన విశాల్… అధికారుల దాడులను ధృవీకరించాడు. అయితే ఇది తన మాటలకు ప్రతీకారంగానేనా అనేది మాత్రం తనకు తెలియదన్నాడు. అలాగని కాకతాళీయంగా జరిగినవి అని కూడా తాను అనుకోవడం లేదంటూ ఈ ఉదంతంపై తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేశాడు. అంతేకాదు… దాడులకు భయపడననే రీతిలో విశాల్ మరింత స్వరం పెంచాడు.
ఇప్పటి దాకా మెర్సల్ సినిమాలోని వివాదాస్పద అంశాలపై మాట్లాడని విశాల్… సోమవారం మాట్లాడుతూ ఆ సినిమాను అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేఛ్చను కాలరాయడమే అన్నాడు. అంతేకాదు విజయ్ జోసెఫ్ అంటూ సంబోధించడం సినిమాల్లోకి మతాన్ని లాగడం సరైంది కాదన్నాడు. నిజానికి విజయ్ పేరు జోసెఫ్‌గా మరింత బాగుందన్నాడు. అలాగే భాజాపా నేత హెచ్.రాజాపై తన విమర్శలను పునరుద్ఘాటించాడు. ఆయన మెర్సల్ పైరసీ సినిమాను చూడడం ముమ్మాటికీ తప్పేనన్నాడు. ఒక జాతీయ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతగా ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం సిగ్గుమాలిన పని అంటూ తీవ్రంగా దుయ్యబట్టాడు.
ఇదిలా ఉంటే… విశాల్ విమర్శల ధాటికి ఉక్కిరి బిక్కిరైన రాజా… సోమవారం వివరణ ఇచ్చాడు. తాను పూర్తి నిడివి సినిమాను చూడలేదని, కేవలం ఒక క్లిప్‌ను అది కూడా వాట్సప్‌లో షేర్ అవుతున్నది మాత్రమే చూశానంటూ సమర్ధించుకున్నాడు. దాన్ని తాను ఫార్వర్డ్ కూడా చేయలేదన్నాడు. మరోవైపు విశాల్‌కు చెందిన నిర్మాణ సంస్థ రూ.50లక్షల వరకూ పన్నులకు సంబంధించి గోల్మాల్ చేసినట్టు అధికారులు గుర్తించారని సమాచారం. అయితే దీనిపై అధికారులకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ తాను సమర్పిస్తానని విశాల్ అంటున్నాడు.