ఓ కథ ఒప్పుకోవాలంటే
– ఫ్యాన్స్‌ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే.
ప్రయోగాలు చేయాలంటే..
– ఫ్యాన్స్ ఒప్పుకొంటారో లేదో అని ఆలోచించాల్సిందే
కమర్షియల్ ఫార్మెట్ నుంచో, ఇమేజ్ ఛట్రం నుంచో బయటకు రావాలంటే
– మళ్లీ ఫ్యాన్స్ భయమే.
ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తూ వాళ్లకు నచ్చే కథల్ని ఎంచుకొంటూ సేఫ్ జర్నీ చేయడం స్టార్ హీరోలకు అలవాటే. అభిమానులూ అంతే. తన హీరో నుంచి సినిమా వచ్చిందంటే థియేటర్ల ముందు పూనకాలే. సినిమా బాగున్నా – బాగోకపోయినా.. టికెట్లు తెగాల్సిందే. యావరేజ్ సినిమాని హిట్ గా హిట్ సినిమాని సూపర్ డూపర్ హిట్‌గా మలిచేది ఫ్యాన్సే. సినిమా టాక్ ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులూ మాత్రం దిమ్మతిరిగే వసూళ్లు కనిపించాయంటే కారణం… వాళ్లకున్న ఫ్యాన్ ఫాలోయింగే.
కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది. సినిమా ఎలా ఉన్నా గుడ్డిగా థియేటర్లకు వెళ్లే పోయే సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. బాగుంటే చూస్తున్నారు, లేదంటే లేదు. ఓ సినిమాని బలవంతంగా ఆడించాలన్న తపన తగ్గిపోతోంది. సినిమా బాగోలేకపోతే, ఎంతటి పెద్ద స్టార్ అయినా డిజాస్టర్ మూటగట్టుకోవాల్సిందే. స్టార్ హీరో సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ ఖాయం అన్న లెక్కలు ఇప్పుడు గాల్లో కలిసిపోయినట్టే. `స్పైడర్` రిజల్ట్ దీనికి మచ్చు తునక. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఏ రేంజులో ఉంటాయో చెప్పక్కర్లెద్దు. చిత్రీకరణ సమయంలో బీభత్సమైన బజ్ సొంతం చేసుకొంది మహేష్ చిత్రం. తొలి రోజు, ఒక్క ఆట అయ్యిందో లేదో…. సినిమా రిజల్ట్ బయటకు వచ్చేసింది. అక్కడ్నుంచి షో షోకి వసూళ్లు తగ్గడం మొదలయ్యాయి. ఓ రోజు గడిచిందో లేదో… థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇది వరకు మహేష్ సినిమా అంటే ఎలా ఉన్నా తొలి మూడు రోజులు మాత్రం ఆ జోరు ఉండేది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేవారు. ఇప్పుడు అలాంటిదేం జరగలేదు.
‘జై లవకుశ’కీ అంతే. సినిమా బాగానే ఉందన్నారంతా. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఈ మాట చాలు. రికార్డులు వరుస కట్టేయడానికి. కానీ ఏం జరిగింది. బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడాల్సివచ్చింది. హిట్టూ, హిట్టూ అన్న సినిమా చివరికి యావరేజ్ వసూళ్లతో బయపడాల్సివచ్చింది. ఈ రెండు ఉదాహరణలు చాలు. ‘ఫ్యాన్స్ ఉన్నారు.. వాళ్లు చూసుకొంటారులే’ అన్న అపోహల నుంచి హీరోలు బయటకు రావడానికి. అభిమానుల్లో నిజాయతీ పెరుగుతోంది. సినిమా బాగుందంటే, బాగుంది అంటున్నారు. లేదంటే వెంటనే బయటపడిపోతున్నారు. తాము ఎంత చొక్కాలు చించుకొన్నా – ఫలితాలు మారవన్న సంగతి వాళ్లకు అర్థం అవుతోంది. విడుదల రోజున థియేటర్ల ముందు మైకు పెడితే చాలు… తమ అంతరంగాన్ని ఆవిష్కరించేస్తున్నారు. ‘నేను మా హీరోకి వీరాభిమానిని. ఇలాంటి సినిమా చేస్తాడనుకోలేదు’ అంటూ గోడు వెళ్లగక్కుకొంటున్నారు. ఫ్యాన్స్ సైతం సగటు ప్రేక్షకుడిలా ఆలోచించడం మొదలెట్టారు. ఈ సంగతి స్టార్ హీరోలు ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మంచిది. ఇమేజ్ ఛట్రాల్లోంచి, తమకున్న అపోహల నుంచి బయటపడడానికి ఇదే సరైన సమయం. మరి మన హీరోలు ఏం చేస్తారో చూడాలి.