భారత్ ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు తరచూ దానిపైనే దాడులు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు పెషావర్ శివార్లలోగల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై గ్రెనేడ్ లాంచర్లు, ఎకె-47 మిషన్ గన్స్ వాటి అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు దాడి చేసారు. కానీ పాక్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండటంతో వారు ఉగ్రవాదులను త్రిప్పికొట్టారు. భద్రతా దళాల చేతిలో 13 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. కానీ ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో పాక్ ఎయిర్ బేస్ లోని మశీదులో ప్రార్ధనలు చేస్తున్న 16 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక సైనికాధికారితో సహా ఆరుగురు భద్రతా సిబ్బంది కూడా ఈ దాడిలో గాయపడ్డారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిం బజ్వా తెలిపారు.
ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఈ-తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధి మొహమ్మద్ కుర్శానీ ప్రకటించాడు. తమ ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన 50 మంది వరకు చనిపోయినట్లు అతను ప్రకటించాడు.
షరా మామూలుగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దాడిపై తీవ్ర దిగ్బ్రాంతి ప్రకటించిన తరువాత దేశం నుండి ఉగ్రవాదులను ఏరి పారేస్తామని మరోమారు శపథం చేసారు. ఇంతకు ముందు ఇస్లామాబాద్ సమీపంలోగల మిలటరీ స్కూల్ పై ఉగ్రవాదులు దాడి చేసి అందులో సుమారు 147 మంది విద్యార్ధులను అతికిరాతకంగా చంపినప్పుడు, ఆ తరువాత మశీదులు, మార్కెట్ స్థలాలపై ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు కూడా నవాజ్ షరీఫ్ ఇదే విధంగా శపదాలు చేసారు. కానీ నేటికీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.పాకిస్తాన్ వైపు భారత్ కన్నెత్తి చూస్తే, భారత్ కి దశాబ్దాల పాటు గుర్తుండి పోయేవిధంగా గుణపాఠం చెపుతామని హెచ్చరించే పాక్ మంత్రులు, సైన్యాదక్షుడు, ఉగ్రవాదులు పట్టపగలు తమ రక్షణ స్థావరాల మీద దాడులు చేస్తున్నా వారిని ఏమీ చేయలేకపోతున్నారు.
పాక్ ప్రభుత్వం, ఆర్మీ రెండూ కూడా ఉగ్రవాదులతో చాలా విచిత్రమయిన సంబంధాలు నెరుపుతుంటాయి. భారత్ పై దాడులు చేసే ఉగ్రవాదులకు ఒకవైపు రక్షణ, శిక్షణ, సహాసహకారాలు అందిస్తూనే, మరోవైపు వారి ఈవిధంగా చేతిలో చావు దెబ్బలు తిన్నప్పుడు వారిని ఏరిపారేస్తామని ప్రగల్భాలు పలుకుతుంటుంది. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు వేరేగా ఉండరని…ఉగ్రవాదులు అందరూ చెడ్డవారనే సత్యాన్ని లోకానికి చాటి చెపుతుంటుంది. కానీ భారత్ లో దాడులు చేసి పారిపోయి వచ్చిన ఉగ్రవాదులకు తనే రక్షణ కల్పించి కంటికి రెప్పలా వారిని కాపాడుకొంటుంది. ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ఈ ద్వంద విధానం వలననే పాక్ స్వయంగా వారికి బలవుతోంది. అది స్వయంకృతాపరాధమే కనుక అందుకు ఎవరినీ నిందించలేదు కూడా.