కాంగ్రెస్‌లో చేరికను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయుల ముచ్చటలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఎందుకోగాని తన సహజశైలిలో వుండేంత పదునుగా నడవలేదు. తెలుగుదేశం నుంచి ఎందుకు రావలసివచ్చిందో దీర్ఘంగా వివరించడం, చంద్రబాబుపై గౌరవ ప్రకటన టిఆర్ఎస్పై విమర్శలు, కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి కారణాల వివరణ అంతగా పొందలేదు. వాస్తవానికి తెలుగుదేశం గురించి అంతసేపు చెప్పడం వేదికపై వున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారికి ఒకింత ఇబ్బందిగా వున్నట్టు కనిపించింది కూడా. కెసిఆర్‌ను విమర్శించడానికి కావాలని కొన్ని పదాలు తీవ్రంగా వాడటం వాటికి స్పందన వూహించదగినవే అయినా మొత్తంపైన వూపు వుండాల్సినంత లేదని చెప్పొచ్చు. ఇక చివరలో రాహుల్, సోనియా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలని నినాదాలు చేయడం అలవాటు లేని పనిగా అనిపించింది. దానికి తగినట్టే ఉత్తమ్ ప్రసంగంలో రేవంత్‌ను తమ్ముడు అని ఒకటికి రెండు సార్లు సంబోధించడం కాంగ్రెస్‌లో వుండబోయే పరిస్థితికి అద్దం పట్టిందనొచ్చు. రాహుల్ గాంధీని కలుసుకోవడానికి వెళ్లినా కేవలం పదిమందికే అవకాశం వుండటం కూడా అక్కడ పద్ధతులకు తొలి సంకేతం అవుతున్నది.
రేవంత్‌కు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు ఇవ్వాలని అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడున్న భట్టి విక్రమార్క ఏమవుతారు? ఉన్నంతకాలం కూడా ఆ పదవికి ఏం ప్రాధాన్యత నిచ్చారు? అలాటి ప్రశ్నలకన్నా ముఖ్యమైందేమంటే రేవంత్ రాక రాహుల్ పట్టాభిషేకం తర్వాత ఏర్పడే కొత్త నాయకత్వాల ఎంపికలో భాగంగా వుంటుందట. అందుకే ఆయన కొంత హడావుడిగానే చేరుతున్నారట. రాహుల్ తో పాటు రావడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ వ్యవస్థలో ప్రాధాన్యత పెరుగుతుందని రేవంత్ అనుకుంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి రాజీనామా లేఖలోనూ వేదికలపైన కూడా తెలుగుదేశంపై మాట్లాడకపోయినా టిటిడిపి నేతలు మాత్రం దూకుడుగా దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అద్యక్షుడు ఎల్.రమణ ఆయనపై చేస్తున్న వ్యాఖ్యలు అంతబాగాలేవని ఆ పార్టీవారే అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా విమర్శనాత్మకంగానే మాట్టాడారు. మొత్తంపైన రేవంత్ సంయమనం పాటిస్తున్నా టిడిపి నేతలే తొందరపడుతున్నారనే భావం వినిపిస్తున్నది. ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు కూడా తనపై వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చారు.అయితే మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం వాటిపై చంద్రబాబు నాయుడు విచారణ జరిపిస్తారని చెప్పడం కొసమెరుపు.