కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి డిసైడయ్యాక, రాహుల్‌ని కలిసొచ్చాక… రేవంత్ తిన్నగా హైదరాబాద్ వచ్చి తన పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ వేసేశాడు తెలంగాణలో మునిగిన నావను మరింత ముంచడంతో పాటు ఆంధ్రాలో ” పచ్చ” గా ఉన్న చోటా వీలైనంత కెలికాడు. . పయ్యావుల, పరిటాల, యనమల… గురించి లా పాయింట్లు లాగి ఒక్కసారిగా ఎపి తేదేపా అగ్రనేతల్ని అడ్డంగా బుక్ చేసేశాడు. మరి అలాంటి రేవంత్… ఇప్పుడు ఎందుకు సైలెంటయ్యాడు? అవతల నుంచి వాగ్భాణాలు వచ్చి గుచ్చుకుంటున్నా అసలేమీ తగలనట్టే ఎందుకు ఊరుకున్నాడు?
రేవంత్ ఆరోపణలపై ఎపిలో ఒకటీ అరా తెదేపా నేతలు ఫైరయ్యారు. సరే… సంబంధం లేని వాళ్లు మాటలకి సమాధానం ఇవ్వడం దేనికి అనుకుని ఊరుకున్నాడులే అనుకుందాం. అయితే రేవంత్ తనపై చేసిన ఆరోపణలపై పయ్యావుల కొన్ని రోజుల క్రితం స్పందించాడు. తెలంగాణలో బీర్ల కంపెనీ నడపడం లేదని ఒక చిన్న బార్ మాత్రమే ఉందని బదులిస్తూ… పనిలో పనిగా రేవంత్‌పై విమర్శలు, ప్రత్యారోపణలు కూడా చేశాడు. అందులో మరీ ముఖ్యమైనది… కెసియార్ కుమార్తె కవితతో రేవంత్‌కు ఉందన్న వ్యాపార బంధం. ఇది నిజంగా చాలా బలమైన ఆరోపణే. పొద్దున్న లేస్తే కెసియార్ కోట కూల్చడం తప్ప మరో పనేమీ తనకు లేదనే రేవంత్… నిజానికైతే ఈ ఆరోపణపై తప్పకుండా సమాధానం చెప్పాలి. అలాగే రేవంత్ రాజీనామా చేసే వరకూ ఆగిన యనమల కూడా తనపై రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించాడు. పార్టీ మారాలనుకున్నప్పుడు కొందరు ఇలాంటి పసలేని ఆరోపణలు చేయడం మామూలే అంటూ తీసిపారేశాడు. తనకెలాంటి కాంట్రాక్ట్లులు లావాదేవీలు లేవన్నాడు. దీనిపై కూడా రేవంత్ ఏమీ బదులివ్వలేదు. తను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయంటూ అనలేదు.
వీలైనప్పుడల్లా బాబు దేవుడు అని కీర్తిస్తూ మరీ కాంగ్రెస్‌లోకి వెళుతున్న ఈ సరికొత్త ట్రెండీ లీడర్ తను అమితంగా ఇష్టపడే చంద్రబాబు సూచనల మేరకే ఇక ఎపి తెదేపాను మాత్రం కెలకకూడదని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌లోకి రేవంత్ వెళ్లడం అనే విషయం కంటే, కెసియార్‌ను ఇరుకునపెట్టడానికి రేవంత్ చేసే విమర్శలు, తీసే కుంభకోణాల గుట్టుమట్లు ఆంధ్రప్రదేశ్‌లోని తన ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది కరంగా మారుతాయేమోననే ఆందోళన బాబుకు ఎక్కువ అవడంతోనే… ఈ విషయంలో రేవంత్‌కి గట్టిగా చెప్పారట. అయితే కొంత కాలం పాటు ఈ అనధికారిక ఒడంబడికలు తూచ తప్పక నడచినా, ఎన్నికల వేడి అంటుకున్న సమయంలోనూ వీటిని గుర్తుంచుకునేంత తీరిక, ఓపిక రాజకీయనేతలకు ఉంటుందా? చూద్దాం.