చిరంజీవి… రాజశేఖర్.. వీళ్లిద్దరిదీ టామ్ అండ్ జెర్రీ ఆట! ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. చిరు అభిమానులు రాజశేఖర్ని ఇబ్బంది పెట్టడం, రాజశేఖర్ కూడా చిరుపై ఘాటైన విమర్శలు చేయడం ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. ఓ సందర్భంలో రాజశేఖర్ ఇంటికి చిరు వెళ్లి… సముదాయించి వచ్చాడు. రాజశేఖర్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, చిరుకి సంబంధించిన ఓ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. వాళ్లిద్దరి మధ్యా గ్యాప్ పెరుగుతోంది అనడానికి రాజశేఖర్ చెప్పే సమాధానాలే నిదర్శనాలు.
అయితే ఇప్పుడు చిరు, రాజశేఖర్లు ఒక్కటైపోయారు. ఇద్దరూ కలసి ముచ్చటించుకొన్నారు. రాజశేఖర్ నటించిన గరుడ వేగ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసొచ్చారు. తన సినిమాని చూడాల్సిందిగా ప్రీమియర్ షోకి ఆహ్వానించారు. ”చిరంజీవిగారిని కలిశా. నా సినిమా చూడమని ఆహ్వానించా. ఆయన అప్పటికే గరుడ వేగ ట్రైలర్ చూశార్ట. మా ఆఫీసులో ట్రైలర్ చూశా.. చాలా బాగుంది అని మెచ్చుకొన్నారు” అని రాజశేఖర్ చెప్పారు. పవన్ కల్యాణ్నీ కలుసుకోవాలని రాజశేఖర్ భావించినప్పటికీ, ఆ సమయంలో పవన్ ఆఫీసులో లేకపోవడం వల్ల కుదర్లేదని సమాచారం.